మీగడ తరకలు

ఆయన శూలం తిప్పితే ఈయన వాలం తిప్పాడట...


ఆతుకూరి మొల్ల కృష్ణదేవరాయలను సందర్శించినప్పుడు చెప్పిన పద్యం ఇది

అతడు గోపాలకుండితడు భూపాలకుం
డెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు పాండవపక్షుడితడు పండితరక్షు
డెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు యాదవపోషి ఇతడు యాచకతోషి
యెలమినాతని కన్ననితడు ఘనుడు
అతడు కంసధ్వంసి ఇతడు కష్టధ్వంసి
యెలమినాతని కన్ననితడు ఘనుడు

పల్లెకాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీలకాతండు పద్మినీ స్త్రీలకితడు
సురలకాతండు తలప భూసురులకితడు
కృష్ణుడాతండు శ్రీమహాకృష్ణుడితడు



ఇది విన్నాక తెనాలి రామకృష్ణయ్య ఊరకుంటాడా? కృష్ణదేవరాయలు మానవమాత్రుడే తప్ప ఆ దేవదేవుడు కృష్ణుడితో సమానం కాదని, మొల్లని అధిక్షేపిస్తూ ఇలా చెప్పాడట

అతడంబకు మగండితడమ్మకు మగండు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతడు శూలముద్రిప్పు నితడు వాలము ద్రిప్పు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతడమ్మున నేయు నితడు కొమ్మునడాయు
నెలమినాతనికన్న నితడు ఘనుడు
అతని కంటను చిచ్చు నితని కంటను బొచ్చు
నెలమినాతనికన్న నితడు ఘనుడు

దాతయాతండు గోనెల మోత యితడు
దక్షుడాతండు ప్రజల సంరక్షకుడితడు
దేవుడాతండు కుడితికి దేవుడితడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు

మొల్ల అలా అనడం అతిశయోక్తే తప్ప, అందులో ఔచిత్యం లేదని వికటకవీంద్రుల వారు తెలియచేసారు. శివుడికీ, ఎద్దుకీ సారూప్యాలు తెచ్చి ఎద్దును శివుడికన్నా అధికంగా నిరూపించడం రామకృష్ణయ్యకే సాధ్యం.




www.maganti.org