మీగడ తరకలు

శ్రీశ్రీకి చక్రపాణి కలలో కనపడి ఇలా అడిగాడట !


శ్రీశ్రీ రాసిన సిరిసిరి మువ్వ శతకంలోని కొన్ని మువ్వలు..అన్నీ కందాల అందాలే మరి !

కుర్చీలు విరిగిపోతే
కుర్చోడం మాననట్టు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగు నొకింత చెత్త సిరిసిరి మువ్వా!


పెసలో, బొబ్బర్లో, వే
రుసెనగలో విక్రయించి రూపాయలు బొ
క్కసమున కెక్కించడమా
సిసలయిన కవిత్వ రచన సిరిసిరి మువ్వా!


ఖగరాట్ కృషి ఫలితంగా
పొగాకు భూలోకమందు పుట్టెను గానీ
పొగ చుట్ట లెన్ని అయినను
సిగరెట్టుకు సాటి రావు సిరిసిరి మువ్వా!


ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన ఊరనుండుము
చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము మువ్వా!


శ్రీశ్రీకి చక్రపాణి కలలో కనపడి ఇలా అడిగాడట
నీకొక సిగరెట్టిస్తా
నా కొక శతకమ్ము వ్రాసి నయముగ నిమ్మా
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీ కావ్యము వరలునోయి సిరిసిరి భాయీ!


జీవిత మొక యాగముగా
భావన మొక యాగముగ స్వభావము భోగా
భోగముగ తిరుగు తిరుపతి
జేగురు గడ్డము నుతింతు సిరిసిరి మువ్వా!


ఉగ్గేల త్రాగుబోతునకు?
ముగ్గేలా తాజమహలు ముని వాకిటిలో?
విగ్గేల కృష్ణశాస్త్రికి?
సిగ్గేలా భావకవికి? సిరిసిరి మువ్వా!


అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృ హృదయ సంస్పందంగా
కందా లొకవంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరిసిరి మువ్వా!


తలకాయలు తమ తమ జే
బులలోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రసీకి సిరిసిరి మువ్వా!


ఈ రోజులలో ఎవడికి
నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్
కారాలు, తెగ బుకాయి
స్తే రాజ్యా లేలవచ్చు సిరిసిరి మువ్వా!


ఏవేనా కొత్తవి రా
శావా? చూపించమంచు చంపేవాళ్ళం
తా వినడానికి నేనీ
జీవత్కృతి నాలపింతు సిరిసిరిమువ్వా!


మళ్లీ ఇన్నాళ్లకి ఇ
న్నేళ్లకి పద్యాలు రాయుటది ఎట్లన్నన్
పళ్లూడిన ముసలిది కు
చ్చిళ్లను సవరించినట్లు సిరిసిరిమువ్వా!


తెగకుట్టి వదిలిపెట్టిన
వగణిత వైజాగు దోమలశ్వత్థామల్
పొగరెక్కిన రెక్కేన్గుల్ (?)
శెగ(?)లెగసెడు తుమ్మముళ్లు సిరిసిరిమువ్వా


నాలాగ కంద బంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్ సద్గీతా
లాలాపించే కవితా
శ్రీలోలుడు నహినహీతి సిరిసిరి మువ్వా!


గొర్రెల మందగ, వేలం
వెర్రిగ ఉద్రిక్తభావ వివశులయి జనుల్
కిర్రెక్కి పోయినప్పుడు
చిర్రెత్తుకు వచ్చునాకు సిరిసిరిమువ్వా!


ఇంతెందుకు? వింతలలో
వింతైన విశేషమొకటి వినిపిస్తున్నా
సొంతంగా సాంతంగా
చింతిస్తే పెద్దతప్పు, సిరిసిరిమువ్వా!


పందిని చంపినవాడే
కందం రాయాల టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా? రా
సేందు కయో షరతులేల ? సిరిసిరి మువ్వా!


బంగాళాఖాతంలో
సంగీతం పారవైచి సాయంకాలం
కాంగానే ఆకాశపు
చెంగావిని త్రాగెనొకడు సిరిసిరిమువ్వా!


చివరిగా

"వైవాహిక జీవితములు దావాలకు దారితీసి తగులడిపోతే కేవలము పెళ్ళిమాని ఖుషీవాలాలగుట మేలు సిరిసిరి మువ్వా"
అని కూడా అన్నాడండోయి ఆయన


www.maganti.org