మీగడ తరకలు

నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


1660 ప్రాంతంలో నెల్లూరు జిల్లా తెట్టు గ్రామ వాస్తవ్యులయిన మోచర్ల వెంకన్న, మోచర్ల దత్తప్ప కవులు తిరుపతి వేంకట కవులకు పూర్వరూపాలుగా కనిపిస్తారు అని తెలియవస్తోంది. వివిధ రాజుల ఆస్థానాలు సందర్శించి అక్కడి విద్వత్కవులను ఓడించి, ఘనసమ్మానాలందుకున్న ఘనులట. ఉదాహరణకి వీరి సమస్యా పూరణ ఒకటి చూడండి

సమస్య: నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

చం: అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ ! వాయుపుత్ర ! ఓ
పనస! సుషేణ ! నీల ! నల ! భానుకులుం డగు రాఘవేంద్రు డ
ద్దనుజ పురంబు నే గెలువ, దైత్యుల జంపగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


అలాగే మొదట ష కారం, చివర క్ష కారం వచ్చేట్టు పూరించమని అడిగితే చెప్పిన పద్యం

షాక్షర మాదిగ చెప్పెద - నీ క్షణమున కందపద్య నివహము వరుసన్
వీక్షింపర దయతో నిటు - రాక్షస హర ! రామ ! మోక్ష రామాధ్యక్షా!


www.maganti.org