మీగడ తరకలు

"ఇంగ్లీషు ముష్టి బాగా కిడుతుంది అని కావును.."


భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)పుస్తకం లోని ఒక అద్బుతమయిన ప్రసంగం.
ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానాలు వినపడతాయి అని
ఇంగ్లీషు ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ.
సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే
  • ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
  • సమాధానం - వదిలెయ్
  • ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
  • సమాధానం - పాతెయ్
  • ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
  • సమాధానం - తీసెయ్
  • ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
  • సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు
  • ప్రశ్న - ఇంగ్లీషు ?
  • సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!
  • ప్రశ్న - హిందీ?
  • సమాధానం - అచ్చా! అందులో హుషా, మజా ఉన్నాయి. అయితేనేం? లిపి నాకు రాదు
  • ప్రశ్న - పోనీ తెలుగు ?
  • సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!
  • ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
  • సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు
  • ప్రశ్న - తెలుగులో పాతరచన?
  • సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట
  • ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
  • సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం
  • ప్రశ్న - చదివి చూశావా?
  • సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?
  • ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
  • సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.
  • ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
  • సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు
  • ప్రశ్న - తెలుగులో పాత పాటలు?
  • సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడాని కోసం
  • ప్రశ్న - కొత్త పాటలు?
  • సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.
  • ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
  • సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లేడు.
  • ప్రశ్న - తెలుగు పత్రికలు?
  • సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు
  • ప్రశ్న - తెలుగు యంత్ర పరిశ్రమలు?
  • సమాధానం - పేపరు మిల్లు, బట్టల మిల్లు వగైరా కొన్నింటిలో తెలుగే లేదు, తక్కిన వాటిలో పరిశ్రమే లేదు
  • ప్రశ్న - తెలుగు వాళ్ళ విదేశ వర్తకం?
  • సమాధానం - అది సాగుతుండేది అన్యభాషా పరిచయం వల్లే. తెలుగు వల్ల కాదు.
  • ప్రశ్న - తెలుగు పరపతి సంఘాలు?
  • సమాధానం - కొన్ని నరపతి సంఘాలు, కొన్ని తిరపతి సంఘాలు
  • ప్రశ్న - తెలుగు ప్రజల ధనాలయాలు?
  • సమాధానం - కొన్ని సుప్రజాలయాలు, కొన్ని స్వప్రజాలయాలు, కొన్ని లయాలు
  • ప్రశ్న - తెలుగులో భీమాలు?
  • సమాధానం - కొన్ని హేమాలు, కొన్ని కామాలు
  • ప్రశ్న - తెలుగు నాయకులు?
  • సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు
  • ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
  • సమాధానం - అదంతా తెలుగుది కాదు
  • ప్రశ్న - అయితే?
  • సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!
  • ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
  • సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి
  • ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
  • సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు
  • ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
  • సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం
ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ.



www.maganti.org