మీగడ తరకలు

పిలకా గణపతి శాస్త్రిగారి "మాదాకబళం" కవిత


ఒక్కొక్కరికి ఒక్క రచనతోనే పేరు వస్తుంది. పిలకా గణపతి శాస్త్రిగారి "మాదాకబళం" కవిత ఆయనకి ఎంతో పేరు తెచ్చి పెట్టింది. 1950 ప్రాంతాలనాటి ఈ కవిత పూర్తిపాఠం "కల్పన" లోనే దొరుకుతుంది -
"హోరని గాలి దుమారములెగరన్
భోరని ధారావర్షము కురిసెన్
చీకటిలో ఎవరో ఆ నీడలు
ఆకలితో ఏవేవో ఘోషలు
అమ్మా! మాదాకబళం తల్లీ
అమ్మా పిల్లల మన్నంతల్లీ!
వరుసం దొలకరి వానలు కురియున్
వరిపైరులు బంగారమె పండున్
కానీ మా వీధులలో మాత్రము
ఆ నీరసరవ దరిద్రగాత్రము
అమ్మా! మాదాకబళం తల్లీ
అమ్మా పిల్లల మన్నంతల్లీ!
వలాహకముల బలాకాగళములు
కులాయముల పులుగుల కలకలములు
వానకురియ సర్వము వికసించెన్
కాని దీనశిశుగళమే మ్రోగున్
అమ్మా! మాదాకబళం తల్లీ
అమ్మా పిల్లల మన్నంతల్లీ!
ఓ విషాదసాగరమణి తరణీ
ఓ విశాల సర్వజగజ్జననీ
వినబడునో వినబడదో నీకై
కనికరమే కలగదొకో మాపై
అమ్మా! మాదాకబళం తల్లీ
అమ్మా పిల్లల మన్నంతల్లీ!"


www.maganti.org