మీగడ తరకలు

కరుణశ్రీ గారి కిడ్‌నేప్


జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు ఒక రోజు కరుణశ్రీ గారింటికొచ్చారట. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో మనుషులందరూ చప్పుడు చెయ్యకుండా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కరుణశ్రీ గారేమొ గంభీరంగా కూర్చుని ఉన్నారు. జరుక్‌శాస్త్రిని చూడగానే "రండి!కూర్చోండి" అని ఆహ్వానించారు. జరుక్‌శాస్త్రిగారేదో చెప్పబోతే "ఉష్!" అని కరుణశ్రీగారు వారించారు. శబ్దం చెయ్యకండి అని సూచించారు. జరుక్‌శాస్త్రిగారు సాధ్యమైనంత తగ్గుస్వరంతో "ఏం జరిగిందీ?" అని కరుణశ్రీ చెవి దగ్గరకు వెళ్ళి అడిగారు. అప్పుడు కరుణశ్రీ గంభీరంగా కిడ్‌నేప్ అన్నారు. ఆ! ఎవరిని? ఎప్పుడు? అని ఆదుర్దాగా అడుగుతుంటే కరుణశ్రీ గారు నవ్వుతూ... కిడ్‌నేప్ అంటే ఎవర్నో ఎత్తుకుపోవడం కాదు. కిడ్ అంటే పిల్లవాడు.. నేప్ అంటే కునుకు తీసుకుంటున్నాడు అని అర్థం. నువ్వు పేరడీకింగ్‌వు కదా..ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? అన్నార్ట కరుణశ్రీ. ఈ విషయం జరుక్‌శాస్త్రి ఆయన మిత్రులందరికీ చెప్పి నవ్విస్తుండేవాడట.
అంపశయ్య నవీన్ గారి "సహస్రాబ్ది మేటి రచయితలు - సాహిత్య కబుర్లు - లేఖలు" నుండి ఈ ఆణిముత్యాన్ని అందజేసిన శ్రీ నాగులపల్లి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో
www.maganti.org