మీగడ తరకలు

"దోమ" పద్యాలు


మంగిపూడి వేంకట శర్మ గారు 1913లో రాసిన "సరసరసాయనము" లోని కొన్ని పద్యాలు. కవిగారి గురించి శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఈ పుస్తక పీఠికలో చాలా ప్రశంసించారు. కవిగారి కాలం, ఇతర రచనలు, వివరాలు అవీ తెలియరాలేదు


గీ!! సారె నాయంత వారలు లేరటంచు
నెగసి పడియెద వెందుకే? నీచజన్మ
ఏనుగౌదువె ! నీవు పాట్లెన్ని పడిన
తొండ మున్నంత మాత్రాన దోమకూన !


క!! జవ సత్వములున్నవె యా
హవములలో ఘనశతఘ్నికాదుల నెల్లన్
దవిలి వహింతువె కరితో
నవమతి! నీకెట్టి సామ్యమరయవె దోమా !


క!! భటులకు వాహంబై యా
ర్భటితో ఘీంకృతులు సెలగ బ్రతివీరమహా
పటలములద్రుంప గలవే
పటుగతి గరహాతుల బహుళపద ఘట్టనలన్ !



గీ!! నెలతలకు మందయానంబు నేర్పగలవొ
దాన ధారల నలులను దనుప గలవొ
పొసగు మౌక్తిక దంతంబు లొసగ గలవొ
సామజమునకు నీకేటి సాటి? చెపుమ !


క!! దూతలు చఱపులటంచును
జేతుల దట్టుచును విసువుచేతను నిన్ను
బూతులు దిట్టుచు రోతురు
రాతురులను మనుజులెల్ల రక్కసి దోమా!



www.maganti.org