మీగడ తరకలు

చిలుకపాట


మన తత్త్వాలలో కావలసినంత వైరాగ్యం ఉంది. ఒకనాడు వీటిని వీధిలో పాడుతూ వచ్చేవారు. తాతలూ, బామ్మలూ పారాయణం చేసేవారు. ఈ "టెక్నాలజీ" యుగంలో వీటి ఊసే లేదు. ఈ తత్త్వాల వల్ల నిరాశ చెందమని కాదు - జీవిత పరమార్థం గ్రహించమని. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు కాబట్టి మంచిపనులు వాయిదా వెయ్యకుండా గబగబా చెయ్యమని ప్రబోధించడమే అసలు రహస్యం. ఒకనాడు జనం పాటగా వుండి ఈనాడు విస్మృతికి గురైన ఈ చిలుకపాటను గుర్తుచేసుకుందాం


"ఎన్నాళ్ళు బతికినా కల్ల సంసారమిది
కనిపెట్టి తిరగవే చిలుకా
మూన్నాళ్ళ బ్రతుకు నీకు
మురిసేవు తుళ్ళేవు - ముందుగతికానవే చిలుకా!


కొడుకు వండినకూడు గూటికాకుల పాలు
దిక్కెవ్వరే నీకు చిలుకా!
వంటిమీదాగుడ్డ ఏటిచాకలిపాలు
దిక్కెవ్వరే రామచిలుకా!


నిన్ను పెంచినవారు నీళ్ళు మేతలుపెట్టి
తలుపడ్డమేసిరే చిలుకా!
తలుపుచాటున పిల్లి తా పొంచియున్నది
తప్పించుకో రామచిలుకా!


కట్టెలే బంధువులు నిప్పులే స్నేహితులు
కన్నతల్లెవ్వరో చిలుకా!
కాలయముడూ వచ్చి కూలబడి తంతేను
దిక్కెవ్వరే నీకు చిలుకా!


పచ్చని చేలకి వుచ్చులొడ్డున్నారు
తప్పించుకో రామచిలుకా
వుచ్చులో బడనేల వూపిరి పోనేల
పరనింద మనకేల చిలుకా!


ఆలుపిల్లలు నాది ఆస్తంత నాదని
చాలమోహించేవు చిలుకా!
ఇల్లు ఇల్లనియేవు యిల్లు నాదని యేవు
నీ ఇల్లు ఎక్కడే చిలుకా!


ఊరికుత్తరాన రెండు చెఱువులమధ్య
పారేసి వత్తురే చిలుకా!
మోసేరు నలుగురు వెంబడిని పదిమంది
కడకు తొలగొత్తురే చిలుకా!
కాలిపోయేదాక కావలుందురుకాని
వెంటనెవరూ రారు చిలుకా!



డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి సాహిత్య కబుర్లు నుండి


www.maganti.org