మీగడ తరకలు

భావకవిత్వం గిట్టని చెళ్ళపిళ్ళ


భావకవిత్వం గిట్టని చెళ్ళపిళ్ళ

"మున్ పటి రూల్సుకు కట్టుపడమ"ని చెప్పినా చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు భావకవిత్వంపై ధ్వజమెత్తారు. బహుధాన్య సంవత్సరంనాటి "అభినవ సరస్వతి" పత్రికలోని ఈ రచన చదివితే చెళ్ళపిళ్ళవారి భావాలు తెలుస్తాయి.


"భావప్రధానమగు కవిత్వమే భావకవిత్వమగు. ఈ కవిత్వమందు బ్రయోగించు పదములన్నియు సంస్కృత పదములే కాని మనకవి సంపూర్ణముగ దెలియుట దుర్లభము. భావకవిత్వమనినంతమాత్రమున బదుగురకు దెలియనిచో బ్రయోజనమేమి? అంగటిలో నన్నియు నున్నవి - అల్లుని నోట శని యున్నది యన్నట్లగును. భావప్రధాన వాక్యములు కొంతవరకుండి తదితరము కొంతచేరియుండవలెనుగాని తుట్టతుదవఱకు నొకటే యుండరాదు. నేటి భావకవిత్వము గూటి చిలకేదిరా చిన్నన్నా లాగున వెళ్ళుచున్నది. అర్థము జెప్పలేము. ఇది యొక పరిభాష. సైన్సులోను, వైద్యములోను నెటులో యటులే నేటి భావకవిత్వమందును నీ పరిభాష ముక్కలు పడుచుండును.


ప్రతి పుస్తకమందును నీ భావకవిత గాంపింపగలదు. కాని పూర్వులీ కవితకు శీర్షిక పెట్టలేదు. "కుందనము వంటి మేను మధ్యందినా తపోష్మహతి గందె, వడదాకె నొప్పు లొలుకు వదనమ"ని వరూధిని బ్రాహ్మణునితో బలికెను. ఆ పద్యములో భావకవిత్వ మిమిడియున్నది. భావకవిత్వము నారంభించినవారి యుద్దేశము మంచిదే కాని దాని నితరులెంతవఱకు నిర్వర్తించుచున్నారోయనునది విచారణీయము. ప్రస్తుతము వచ్చెడి భావకవిత్వము ప్రజలనెంతవఱకు రంజింపజేయునను విషయము వేఱు.


ఇక నెంకిపాటల విషయమై సుబ్బారావుగారు యోగ్యతాపత్రమీవలసినదిగ నన్ను గోరిరి. "కడుపులో సెయ్యెట్టి కలసేసినాదే" మున్నగు పద్యములు వ్యంగ్యపూరితముగ మంచి యభిప్రాయమును దెల్పుపట్టులు చాలగలవు. ఒక్కొక్కొచో వ్యాకరణ దోషములను గూడ సరకుచేయకపోవచ్చును. "జగమేలే పరమాత్మా యెవరితో మొరలిడిదు"నను త్యాగయ్యగారు జగమేలెడి యని యనజాలకుండెనా? ఎంకిపాటలలో మొదటినుంచి చివరవరకు రసాభాస గలదు. కొన్నివేళల మాత్రము స్వదేశభాషను వాడిన దోషము లేదనిరి. కాని తుట్టతుదివఱకు గ్రంథమంతయు నిట్టి భాషలో వ్రాయుట రసాభాస."


www.maganti.org