మీగడ తరకలు

చమత్కారాలు ప్రమాదకరం


ఆరుద్ర గారొకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు రాచకొండ విశ్వనాథశాస్త్రిని చూడటానికి వాళ్ళింటికెళ్ళారట. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడక్కడకు ఆరుద్రకు బాగా తెలిసిన ఆయన బంధువు ఒకాయనొచ్చాడట. ఆయన ఆరుద్రను చూడగానే "ఏమండీ ఆరుద్రగారూ! మీరు మద్రాసులో అదే ఇంట్లో ఉంటున్నారా?" అని అడిగాడట. అందుకు ఆరుద్ర కాస్త చమత్కారంగా "అదే ఇల్లు. అదే ఇల్లాలు" అని టక్కున సమాధానం చెప్పాడట. దీంట్లో అభ్యంతరకరమైన మాటేది లేకపోయినా ఈ మాట విని పక్కనే ఉన్న రా.వి.శాస్త్రి గారు చాలా నొచ్చుకున్నారట. ఆరుద్ర తనను దెబ్బకొట్టడానికే "అదే ఇల్లు - అదే ఇల్లాలు" అని సమాధానం చెప్పాడని రా.వి.శాస్త్రి ఫీలయ్యాడట. ఎందుకంటే రా.వి.శాస్త్రి గారికి రెండిండ్లు, ఇద్దరు భార్యలని అందరికీ తెలిసిందే కదా! ఈ సంఘటన జరిగాక రా.వి.శాస్త్రి ఆరుద్రతో మాట్లాడటం మానేశాడట! చమత్కారాలు ప్రమాదకరంగా మారటమంటే ఇదే.
అంపశయ్య నవీన్ గారి "సహస్రాబ్ది మేటి రచయితలు - సాహిత్య కబుర్లు - లేఖలు" నుండి ఈ ఆణిముత్యాన్ని అందజేసిన శ్రీ నాగులపల్లి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో
www.maganti.org