ఒకసారి విశ్వనాధ సత్యనారాయణ గారికి రాష్ట్ర సచివాలయంలో పని కావలసి వచ్చింది. సచివాలయం లో పని అంటే పెద్దవారితో పరిచయాలో , లేకపోతే అక్కడ పని చేసేవారో తెలియకపోతే పని జరగదు అని అందరికీ తెలిసిన విషయమే గదా. మరి ఎందుకో విశ్వనాథవారి పని కూడా చాలా రోజులుగా తెమలకపోవడంతో ఒక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు. సచివాలయంలో వారికి కావలసిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోమని ప్రకాశం గారిని అడిగారు. అందుకు మన ఆంధ్రకేసరి గారు కొంత విముఖత చూపుతూ ఆ సచివాలయం పెద్ద అడవి అండి. అందులో పనులు అలాగే వుంటాయిఅన్నారు.అందుకు విశ్వనాధ ఓ చిరునవ్వు నవ్వి అందుకే కదండీ తమకు మనవి చేసుకున్నది. మీరు ఆంధ్రకేసరి కదా! ఆ అడవి మీకొక లెక్క కాదు. అని అన్నారట.ఆ మాట విన్నాక ఆంధ్రకేసరి వారు నవ్వుకుంటూ ఆ పని నెత్తిన వేసుకున్నారు. |