తెలుగు కవుల్లో గణపవరపు వేంకటకవిని ఆరుద్ర "సాముగరిడీల పహిల్వాన్" అన్నారు. చిత్రకవితా రీతులనన్నిటినీ ఆపోశన పట్టిన ఈ కవి 883 పద్యాలతో "ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసం" రాసారు. ప్రతి పద్యంలోనూ ఒక చిత్రం - గారడీ కనిపిస్తుంది. ఇందులో 808 వ పద్యంలో ఏకంగా 64 రకాల విచిత్రాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ఆ పద్యం: - |
"సారాగ్ర్య సారస సమనేత్రయుగళ నా
రద రుచికాంతి నరఘన వనిత సారాగధీర విశదవీన తురగ భై రవ భవజైత్ర భరశుభకరణ సారాతిహార విసర చారణహరి సా రసహిత చంద్ర శరజ జయనుత వారాశి నారదవర పూజిత పదగౌ రవకటి ఖడ్గ గరళగళసఖ హరినగ నిలయ గిరిధర యసురదళన మణిమయమకుట సురమణి మధువిశరణ కరివరద కువర రుచిరత రవసనన రహరి లసితదర నిగమ విహరణ హరి" |
ఒక పద్యంలో మరొక పద్యాన్ని ఇమిడ్చి రాయటాన్ని "గర్భకవిత్వం" అంటారని మనకు తెలిసిన విషయమే కదా. ఇటువంటి గర్భకవిత్వాలు పై పద్యంలో 41 వున్నాయట. ఎటు చదివినా ఒకే విధంగా ఉండే అనులోమ విలోమ పద్యాలు మూడు ఉన్నాయట. నాగబంధం, ఖడ్గబంధం వంటి బంధాల్లో రాయబడిన బంధ కవిత్వ పద్యాలు ఇరవై దాకా వున్నాయి. చివర నాలుగు పాదాలు గల ఎత్తుగీతిలో అన్ని అక్షరాలూ లఘువులే కావడం ఒక విచిత్రం.
ఈ విచిత్రమయిన పద్యం నాకెలా తెలిసిందా అని అడిగితే మటుకు - ద్వా.నా.శాస్త్రి గారితో ముఖాముఖీ అప్పుడు దొర్లిన మాటల్లో ఆయన తెలియచేసిన పద్యం అని చెప్పవలసి ఉంటుంది..ఆయనకు ధన్యవాదాలతో |