(To the Stone-Cutters)
-- రాబిన్సన్ జెఫర్స్
పాలరాతిని తొలుస్తూ కాలంతో పోరాడే శిల్పులారా,
విస్మ్రృతిని ధిక్కరించి ముందే ఓడిపోయే ధీరులారా,
మీ క్షుద్ర సంపాదనా ఫలాన్ని అనుభవించండి.
శిలలు పగులుతాయనీ, శిలా లిఖితాలు
విచ్ఛిన్నమౌతాయనీ మీకు తెలుసు.
చదరమైన అంగాల రోమను అక్షరాలు
కరిగి రాలిపోతాయి, వర్షంలో అరిగిపోతాయి.
కవికూడా తన స్తూపాన్ని ఎగతాళిగానే కడతాడు.
మానవుడు మాపైపోతాడు.
ఉల్లస ధరిత్రి మరణిస్తుంది; ధీరభానుడు
గుడ్డిగా మరణిస్తాడు, తన హృదయానికి
తిమిరాన్ని కల్పించుకుంటూ.
అయినా శిలలు వేలాది ఏళ్ళపాటు నిలిచే ఉన్నాయి.
వేదనాపూరిత చింతనలకు పురాతన కవితలో
మధుర ప్రశాంతత స్ఫురిస్తుంది.
(This and the following poems of Jeffers are taken from
The Wild God of the World, An Anthology of Robinson Jeffers
Selected by Albert Gelpi. Stanford University Press,
Stanford, California, 2003.)
ఇంకా మనసు నవ్వుతూనే ఉంది
(Still the Mind Smiles)
-- రాబిన్సన్ జెఫర్స్
**************
తన తిరిగుబాట్లని చూచుకొని
ఇంకా మనసు నవ్వుకుంటూనే ఉంది.
నాగరికతా, మానవాళిని హస్యాస్పదం చేసే ఇతర కీళ్ళూ
ఎగిరే పక్షి జంట రెక్కలలాగా
విపరీతాల్ని సమం చేసుకుంటూ
మొత్తంమీద అందంగానే ఉంటాయని
అంతసేపూ తెలిసి ఉండికూడా,
దుఃఖం, ధనం, నాగరికతా, రోతపుట్టించే కిరాతకాలూ,
మహాయుద్ధాలూ, నీచ శాంతి దుర్వాసనా --
సామాన్య జీవితం పైనా కిందా ఉండే విషాదం విజృంభిస్తుంది.
ఇలాంటి వ్యాకుల సమయానికి విలువకట్టాలంటే
మన పరిపాటినీ, మారని ఉద్రేకాల్నీ,
ఏకాంత ప్రదేశాల్లో కొత్తగా పెరిగి, మంది క్లుప్తపరిచే
మన భావనల ఏకవర్ణ పక్షాల్నీ,
మారని గొర్రెకాపరుల జీవితాల్నీ, కొండలపై పొలాల్నీ, మంది కొద్దీ, పనిముట్లు కొద్దీ, ఆయుధాలు కొద్దీ,
అక్కడి సూర్యోదయాలు అతిసుందరం -- అనీ గుర్తుంచుకోవాలి.
సమదృష్టికని వ్యక్తి ఇక్కడినించి ఉభయపక్షంగా చూస్తాడు.
శ్రావ్యమైన సమూహ ప్రతిగానపు నిర్మానుష్యతనించి
సమూహపు బృందగానంవరకూ
సునిశిత కవి ఈశ్వరుడి వైభవాన్నిగురించి వింటూ.
తిరిగి రాక
(Return)
-- రాబిన్సన్ జెఫర్స్
***********
అతి క్లుప్తం కొంత, అతి వివేకం కొంత.
ధరిత్రిని మనం చుంబించే సమయం వచ్చింది.
అకాశాన్నించి ఆకుల్ని వర్షించనిచ్చే సమయం వచ్చింది.
సంపన్న జీవనాన్ని దాని మూలానికి తిరిగి చేరుకోనీ.
మనోహరమైన సుర్ నదుల తీరాలకి వెళ్తాను.
వాటిల్లో నా చేతుల్ని భుజాలదాకా ముంచుతాను.
నది శిలలపైన సముద్రపుగాలిలో
అల్డరు ఆకులు కంపించేచోట
నా లెక్కల్ని చూచుకుంటాను.
ఉద్రేకపూరితమైన డేగల్ని
దెబ్బవెయ్యనివ్వకుండా, ఎగిరేశక్తి లేకుండాచేసి
వాటి కళ్ళని గుడ్డిచేసే కీటక సమూహాల్లాగా,
పుట్టిపెరిగి, ఆకశాన్ని నల్లబరిచే
నోరులేని మే నెల ఈగల్లాంటి ఆలోచనలు మరి వద్దు.
వస్తువుల్ని తాకుతాను; వస్తువుల్నే.
డేగలకు వస్తువులు ఆహారం; పర్వతం ఉన్నతం.
ఉన్నతమైన ఓ పీకో బ్లాంకో!
నెట్రమైన పాలరాతి తరంగం.
సహజ సంగీతం
(Natural Music)
-- రాబిన్సన్ జెఫర్స్
**************
సముద్రపు ప్రాచీన నాదం, చిరు నదుల పక్షి కిలకిలలూ --
(శశిర ఋతువు వాటికి వెండిని బదులు బంగారాన్నిచ్చింది --
వాటి నీటికి రంగు కలపడానికి.
వాటి తీరాలకి చారలు పెట్టడానికి
గోధుమరంగు బదులు ఆకుపచ్చనిచ్చింది.)
వివిధ గాత్రాలతో అవి ఒకే భాషని పలుకుతాయి.
అందుకే నాకు నమ్మకం --
వాంఛాభయల్లాంటి విభాగాల్లేకుండా
వ్యాధిగ్రస్త దేశాల ఘోషనీ,
ఆకలిగొన్న నగరాల క్రోధాన్నీ
వినగలిగే సత్తువే ఉంటే
ఆ కంఠాలుకూడా వినిపిస్తాయి,
స్వచ్ఛమైన శిశువు కంఠంలాగానో,
సముద్రతీరాన ప్రేమికుల్ని కలగంటూ
ఏకాంతంగా నాట్యంచేసే
ఓ యువతి ఊపిరిలాగానో.
కొండలపై అగ్ని
(Fire on the Hills)
-- రాబిన్సన్ జెఫర్స్
**************
వీచే గాలిలో తేలిపోయే ఆకుల్లాగా
లేళ్ళు గంతులేస్తున్నాయి.
కరకరా రగిలే నిప్పుటలముందటి పొగకింద
చిక్కుపడ్డ సూక్ష్మజీవుల్నిగురించి విచారించాను.
అందానికి ఎల్లప్పుడూ సొగసుండదు.
అగ్నికూడ అందమైనదే; లేళ్ళ భీతికూడ అందమే;
నిప్పు ఆరిపోయింతరవాత, నల్లటి వాట్లమీదిగా
నేను కిందికి దిగివచ్చినప్పుడు,
తగలపడ్డ దేదారు వృక్షం కక్కుమీద
ఒక డేగ కూర్చుని వుంది,
దుడుకుగా, వేటతో లావై,
మడిచిన తుఫానుల భుజాల్ని కప్పుకొని
ఎంతోదూరంనించి వచ్చింది మంచి వేటకని,
వేటమృగాల్ని నిప్పు సాయంతో బయటికి తోలుతూ.
ఆకాశం నిర్దాక్షిణ్యంగా ఉంది, నీలంగా --
కొండలు నిర్దాక్షిణ్యంగా, నల్లగా ఉన్నాయి.
ఆ రెంటి మధ్యా కరుకైన ఈకల ఘన విహంగం.
బాధగా నేను అనుకున్నను. కానీ నా మనసంతా ...
ఆకాశాన్నించి ఓ గద్దని తీసుకొచ్చే ఆ వినాశం
దాక్షిణ్యం కంటా అందమైంది.
కొండా, డేగా
(Rock and Hawk)
-- రాబిన్సన్ జెఫర్స్
****************
ఎన్నో ఉన్నత విషాద భావాలు
తమ కళ్ళని తామే చూచుకునే ప్రతీకం ఇదిగో.
సముద్రపు గాలివల్ల ఏ వృక్షమూ పెరగని
కొన భూమిపై పొడుగ్గా నిల్చున్న
ఈ బూడిదరంగు కొండ,
భూకంపాన్నించి తట్టుకొని
యుగయుగాలుగా తుఫానులు చేవ్రాలుపెట్టిన
దాని శిఖరంపై ఒక డేగ కూర్చుని ఉంది.
నేను అనుకుంటాను: ఇదే నీ ప్రతీక,
శిలవా కాదు, తేనెపట్టూ కాదు.
దీన్ని భవిష్యదాకాశాన వేలాడవెయ్యి.
కానీ ఇదే; ఉజ్జ్వల శక్తి, అంధకార శాంతి;
అంతిమ నిర్లిప్తతతో జంటపడ్డ
భయానక చైతన్యం
ప్రశాంత మరణంతోటి జీవనం;
స్థూల శిలా రహస్యంతో పరిణయమై
వైఫల్యం నిరుత్సాహపరచలేని,
విజయం గర్వపరచలేని
వాస్తవికమైన
ఆ డేగ కళ్ళూ, చేతలూ.
పొరలు
(Layers)
-- స్టాన్లీ కూనిట్జ్
***********
ఎన్నో బతుకులు బతికాను,
వాటిల్లో కొన్ని నావే.
కానీ నేనుమాత్రం అప్పటివాణ్ణి కాను,
జీవనమూలం ఒకటి ఏదో మిగిలే వుంది --
దాన్నించి దూరం కాకుండా వుండడానికి
పాకులాడతాను.
ప్రయణాన్ని సాగించడానికి
బలాన్ని చేకూర్చుకునేముందు
వెనక్కి తిరిగి చూడాల్సివచ్చినప్పుడు
నేను తిరిగి చూస్తే
దిక్చక్రంపై ఉడిగిపోయే మైలురాళ్ళనీ,
పాడుపెట్టిన మకాముల్లో
బరువైన రెక్కలతో
కుప్పదేవతలు చుట్టుతూవుంటే
నెమ్మదిగా మండుతూ, జీరాడుతూండే మంటల్నీ, గమనించాను.
ఆవును, సత్యమైన నా మమతలతో
ఓ కుటుంబాన్ని కట్టుకున్నాను.
కాని ఆ కుటుంబమంతా చెల్లాచెదురైపోయింది.
ఆ నష్టాల విందుకి నా హృదయం
ఎలా సమాధానపడుతుంది?
దోవలో మరణించిన
నా స్నేహితుల పెనుధూళి లేచే గాలిలో
నా ముఖాన్ని బాధగా కరుస్తోంది.
అయినా నేను తిరుగుతూంటాను;
కొంత కొంత ఉత్సాహంతో
వెళ్ళల్సినచోటుకి వెళ్ళడానికి
పదిలపరచుకున్న సంకల్పంతో
తిరుగుతాను.
రోడ్డుమీది ప్రతి రాయీ నాకు ఎంతో విలువైంది.
ఆ కాలరాత్రి
చంద్రుడు మసకపడ్డప్పుడు
ఆ శిథిలాల్లో తిరిగాను.
అప్పుడు వర్చస్సుగల ఓ కంఠం
నన్ను ఆదేశించింది:
"గడ్డి పరుపుల్లో పడుకోకు. పొరల్లో జీవించు."
ఆ ఆదేశాన్ని విడమరిచి చెప్పగలిగే
సామర్థ్యం నాకు లేకపోయినా
నా పరిణామాల పుస్తకంలో
తరవాతి అధ్యాయం
నిశ్చయంగా రాసిపడేవుంది.
మార్పులతో నాకు ఇంకా పని తీరలేదు.