మధురగతి రగడ


అతివను వర్ణించే ఒక అద్భుతమయిన మధురగతి రగడ చూడండి. కోలాచలం శ్రీనివాసరావు గారు 1895 లో వ్రాసిన సునందినీపరిణయము అనే నాటకము నుంచి.


*******************************************************
నెఱికురు లిరు లని-నీలపుసరు లని
శరదనికర మని-షట్పదగణ మని
కామినికీల్జడ-కాలోరగమని
భామినియలకలు-బంభరకుల మని
బాలశశాంకుడు-బాలనిటల మని
వాలుకనుబొమలు-వా లగువిం డ్లని
చెలికనిగవసిరి - చెన్ను కలువ లని
వెలిదామర లని-వీనులు మేరని
యతివకనీనిక-లళిబిత్తరు లని
సతివాల్చూపులు-స్మరునిశరము లని
హరిణచపల మని-హరువులగని యని
కరుణారసభర-కాసారం బని
తి రగునాసిక-తిలపుష్పం బని
చారుతరం బగు-సంపెగసుమ మని
అధర మమృతమని-యలబింబం బని
మధురముబూనిన-మావులచివురని
మరుతాపములను-మాన్పెడుమం దని
పరిమళములు గల-పద్మాకర మని
కప్పురగని యని-కాంతిబగడ మని
దప్పుల దీర్చెడు-తావిజలము లని
తరుణిరదనములు-తారలచా లని
మురువులమొల్లల-మొగ్గలతీ రని
చిఱుచిన్నెలు గల-చిఱుతనగవు గని
విరులసరము లని-వెన్నెలబా ఱని
కాంతకపోలము-కాంతముకుర మని
సంతత ముడురా-ట్ఛకలసమం బని
నెలతకు వీనులు-నెగడెడుశ్రీ లని
నలు వగునవములు-నవశష్కులు లని
వెలదివదన మహ-విధుబింబం బని
జలజాతం బని-సరససదన మని
మానినిమోమును-మానితముగ గని
పూనిక సుకవులు-పొగడుదు రవనిని
కలకంఠికి గల-గళ మబ్జం బని
కలనాదంబులు-గలవేణువె యని
మదనున్న్ డుంచిన-మంగళనిధికిని
గదలనిరేఖల-గట్టినక ట్టని
బాహులమూలలు-బంగరుపస లని
యూహకు మీరిన-యురగపుఫణు లని
పడతిభుజములను-బగడపుగుము లని
యడరెడుబాహుల నమరశాఖ లని
జలజముతూం డ్లని-జాళ్వాలత లని
చెలిపాణులు సిరి-చెలిసదనము లని
కిసములనన లని-గీర్తికినిధు లని
యసమానాంగుళు-లబ్జదళము లని
కరరుహములు రి-క్కలు సూసములని
తిర మగురుచిమౌ-క్తికములచా లని
సతిచనుగవ గన-జక్కవకవ యని
మతికి హితం బగు-మాలూరము లని
లికుచము లని సిరి-లిబ్బులుగిరు లని
చకచకలాడెడు-జాళ్వాగిం డ్లని
పుత్తడిబంతులె-పూగుత్తులె యని
మత్తేభంబుల-మదకుంభము లని
చెలియారును గని-చీమలబా ఱని
కలుములు గాచెడు-కాలోరగ మని
లావణ్యార్ణవ-లహరులు వళులని
యావట మగుభా-గ్యావహకళ లని
పొలతికిబొక్కిలి-పొన్నకుసుమ మని
తెలిదామర యని-తీ రగుగుహయని
పరిమళరసయుత-పద్మాకర మని
తరుణినడుము లే-దని మరి కల దని
హరిపదమని మరి-హరిరూపం బని
యరయగనాటక-మని మఱి యసదని
పరిపరివిధముల-బండితు లిమ్మహి
సరసిజముఖి గని-సారెకు నెంతురు
శుభవతి కిరవగు-శ్రోణి యచల మని
యభిరామంబగు-నమృతపుబ్రో లని
బలుపులినము లని-బంగరునిధు లని
యలసగమనతొడ-లనటులసిరులని
కర మరు దగుకరికరములశ్రీ లని
మురిపెము గులికెడు-మోకాళ్ళనుగని
సరసోరుద్యుతి-సంపద లొలుకని
బిరుదులబింకపుబిరడబిగువు లని
తరుణికి జంఘులు-తనరుశరధులని
పరికింపగ సతి-ప్రపదము దులులని
పదములు పంకజ-పదములరుచు లని
మధుమాసంబులమావులచివు రని
పరిపరివిధముల బడతిసొబగు గని
నరవరు లెన్నడునతిశయములు విని
కన్ను లలరగను-గన్నెను గంటిని
సన్నుతగుణముల-సతి కీయవనిని
సరి లే దంటిని-సరి యిదె యంటిని
తరుణులలో మే-ల్తరమిది యంటిని
తపసుల నైనను-తహతహపెట్టుర
చపలత లెరుగని-చపలారేఖర
సౌరభ మొందిన-జంత్రపుబొమ్మర
పరిమళ మొందిన-పసిడిసలాకర
జీవకళలు గల-చిత్తరుప్రతిమర
వాగ్విభవము గల-వన్నెలచిలుకర
వెన్నెలపులుగుల-విం దగుమోముర
వన్నెలకేకుల-వాపిరివేణిర
కోకిల యాకలికూడగునధరి ర
కోకము లుబ్బెడుగుబ్బలతరుణి ర
ఒయ్యారము గలయొప్పులకుప్పర
సయ్యాటములకు సరి యగుసరసి ర
వెయ్యాఱులలో వెతకిన లేదు ర
అయ్యారే! భళి! యంగనసవతు ర
ఇంతిసొబగు నే నెంత నుతింతుర!
ఎంతనుతించిన నింతికి వెల్తి ర
*******************************************************















Keywords: kOlAchalam SrInivAsa rAo, kOlaacalam SreenivAsa rAvu, ragaDa, ragaDalu, jAnapada sAhityam, jaanapada saahityam, madhuragati ragaDalu, sunandinI pariNayamu, nATakamu, telugu jAnapada rachanalu