గడుసు పెళ్లాం



నీకేల ఈ గండుతనము మగడా
నీకేల ఈ గండుతనము మగడా
టీకి టాకు జూపిన నాకేమిఘనము
నీకేల ఈ గండుతనము మగడా

చిన్నమ్మగారి యాచిన్నసూరి మగడు
చిన్నయ్యయెంతో మంచివాడు, దాని
పున్నెముకొద్దీ దొరికినాడు, నగ
లెన్నెన్నో చేయించినాడు, ఊర
కున్నదానేవండుతాడు, దాని
కన్నముబెట్టుతాడు , తిన్నాకుదీసుతాడు
నీకేల ఈ గండుతనము మగడా
నీకేల ఈ గండుతనము మగడా

తెల్లవారగలేచి యిల్లుగుమ్మములూడ్చి
కళ్ళాపుతాజల్లుతాడు, ముగ్గు
లెల్లతానేబెట్టుతాడు, పెరుగు
చల్లపాలుదెచ్చుతాడు, కడవ
నీళ్ళుకాచీచ్చుతాడు, దాని
ఒళ్ళెళ్ళబట్టుతాడు, పిల్లలనుదీసుతాడు
నీకేల ఈ గండుతనము మగడా
నీకేల ఈ గండుతనము మగడా