పిఠాపురం సంస్థానం

ఆంధ్రదేశ సంస్థానాల గురించి ఆచార్య తూమాటి దొణప్ప గారు, సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన తన రచన "ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము" లో ఆయా సంస్థానాల పుట్టుపూర్వోత్తరాలతో సహా, సాహిత్యానికి ఆయా సంస్థానాలు చేసిన సేవ హృద్యంగా వివరిస్తారు..

పిఠాపురం సంస్థానానికి సంబంధించిన వివరాలు, ఆ పుస్తకంలోనుండి తీసుకుని పి.డి.ఎఫ్ పత్రంగా ఇక్కడ పొందుపరచాను. ఈ వివరాలు ఇలా ఇక్కడ ప్రచురించడం ఎవరికైనా అభ్యంతరమైతే తెలియపరచండి. క్షమాపణలతో తొలగిస్తాను.

ఇతర సంస్థానాల పేజీల్లో పొందుపరచినట్టు, పిఠాపురం సంస్థాన జమీందారుల చిత్రాలు, సంస్థాన చిత్రాలు ఇక్కడ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తూ, ఒకవేళ మీ వద్ద ఉంటే పంచుకోమని విన్నవించుకుంటూ మేము చేస్తున్న ఈ చిన్నపనికి సహాయం అందించమని కోరుతున్నాను

పిఠాపురం గురించి ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారు ఒక వ్యాసంలో ఇలా వివరిస్తారు::

పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదిట. ఈ విషయాన్ని శ్రీనాధుడు భీమేశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.

“హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్‌
ఖేటము లోహదండము నొగిం ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్‌”


ఈ ఊరుని వెలమ రాజులు పాలించే వారు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించేరు. వింజమూరి సోమేశ (రాఘవపాండవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిమంచి జగ్గ కవి, కూచిమంచి గంగన్న, దేవులపల్లి బాపన్న, పిండిప్రోలు లక్ష్మన్న, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి, దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, రెండవ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి,ప్రభృతులు పిఠాపురం ఆస్థానంలోని వారే!

పూర్తి వ్యాసం ఇక్కడ -
http://eemaata.com/em/issues/200409/147.html