శ్రీమతి రత్నాశాస్త్రి
సంగీత పాఠాలు


శ్రీమతి రత్నాశాస్త్రిగారు శ్రీ చర్ల భాస్కరరామ శాస్త్రిగారి సతీమణి. ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. వీరు అక్కడ ఎంతో మంది విద్యార్థులకి సంగీత శిక్షణ ఇస్తున్నారు. సంగీతం అంటే ప్రాణంగా భావించే వీరు, నేను అడిగిన వెంటనే కాదనకుండా తనకు తెలిసిన విద్యని మన తెలుగువారందరితో పంచుకోవాలనే మంచి మనసుతో ఒకటొకటిగా సంగీతంలోని మెళకువలను, అణుకువలను శ్రవణ పాఠ్య రూపంలో మీ ముందుకు తీసుకుని రావటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి శతకోటి ధన్యవాదాలతో. వీరి భర్త శ్రీ చర్ల భాస్కర రామశాస్త్రిగారు మహాపండితులయిన బ్రహ్మశ్రీ చర్ల భాష్యకార శాస్త్రిగారి మనవడు.
శ్రీమతి రత్న కుమారి గారు 1966 లో ఉస్మానియా యూనివర్సిటీనుంచి బీ.యే పట్టా పుచ్చుకున్నారు. చిన్నప్పుడు కర్ణాటక సంగీతంతో పాటు భరతనాట్యం కూడ నేర్చుకుని ప్రదర్శనలు ఇచ్చారు.అరవైయ్యో దశకం మధ్యభాగంలో కెనడా దేశానికి వచ్చినతరువాత కుటుంబ వ్యవహారాలు, ఇద్దరు మగ పిల్లల పెంపకం బాధ్యతలలో నిమగ్నురాలయిపోయి మళ్ళీ ఇరవై యేళ్ళ తరువాత భర్త ప్రోత్సాహంతో కెనడా దేశంలోని ఒట్టావా నగర వాసి అయిన గురువుగారు శ్రీమతి కన్నమ్మ శర్మ గారి వద్ద శాస్త్రీయ సంగీత అభ్యాసం మొదలుపెట్టారు. ఈ లోగా భర్త కెనడా ప్రభుత్వ తరఫున సింగపూర్ దేశానికి ఉద్యోగరీత్యా కుటుంబాంతో సహా వెళ్ళగా, అక్కడ ఏడేళ్ళు అమితంగా కష్టపడి ప్రఖ్యాత సంగీత గురువులయిన శ్రీమతి ధనదేవి సుప్పయ్య, మొదలగు వారి దగ్గర శిష్యరికం చేసి, సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటి వారి సంగీత డిప్లోమా పొంది, 1991 లో "ఇశై వాణర్" బిరుదాంకితురాలు అయ్యారు. అక్కడి సింగపూర్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్లో ఆర్టిస్టుగా పనిచేసారు. అక్కడి దేవాలయాలలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 1993లో ఢిల్లీకి వెళ్ళాక, అక్కడి ఢిల్లీ యూనివర్శిటీ నుండి సంగీతంలో ఎం.యే, ఎం.ఫిల్ పట్టా పుచ్చుకున్న వీరు తన శాస్త్రీయ సంగీత యాత్రలో ఎందరో మహానుభావులు - సర్వశ్రీ నూకల చిన్న సత్యనారాయణ, టి.ఆర్.సుబ్రహ్మణ్యం, టి.ఎన్.కృష్ణన్, రాధా వెంకటాచలం, ధన్ దేవి మిత్రదేవా, కౌసల్యా రాజారాం వంటి దిగ్గజాలను కలుసుకునే అదృష్టం కలిగింది అని వినమ్రంగా చెపుతారు. 2000 సంవత్సరంలో టొరాంటో తిరిగివచ్చాక,అక్కడ ఎంతో మంది శిష్యులకు సంగీత దానం చేసిన, చేస్తూ ఉన్న రత్న కుమారి గారు, అక్కడి తెలుగు కల్చరల్ అస్సొసియేషన్ ఆఫ్ టొరాంటో ఆధ్వర్యంలో ప్రతి యేటా జరిగే అన్నమయ్య ఆరాధనోత్సవాలలో సంగీత పరంగా, గాత్రపరంగా ప్రముఖ పాత్ర వహిస్తూ అక్కడి శ్రోతలను ఆనందపరుస్తున్నారు.
మనిషికి, మనసుకి పట్టుదల ఉండాలే కానీ, సంగీతం నేర్చుకుని అందులో అగ్రస్థానానికి చేరటం అనేది ఎప్పటికీ అందని పండు కాదు అని నిరూపించిన శ్రీమతి రత్న కుమారి గారు - మన తెలుగు వారందరూ గర్వపడాల్సిన అచ్చ తెలుగు మహిళ.
శ్రీమతి రత్నా శాస్త్రిగారి గురించి, వీరి కుటుంబం గురించి మరిన్ని వివరాలతో మీ ముందుకు...అప్పటిదాకా ఈ వెలలేని ఆణిముత్యాల సోయగ సౌరభాలను ఆస్వాదించండి



1. స్వపరిచయం




2. శ్రీ త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు




3. శ్రీ త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తనలు







త్వరలో మరిన్ని మీ ముందుకు


www.maganti.org