డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఒక సంగీత కళానిధి


డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు మంచి సంగీతాభినివేశం కల వ్యక్తి. ఆయన పేరుపొందిన సైంటిస్టు, రచయిత కూడా. వీరు శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారి అబ్బాయి.
సంగీతం తన నాలుగో ఏట వినికిడి మీద తనంతట తానుగా నేర్చుకోవటం మొదలుపెట్టి, హిందుస్తానీ, కర్ణాటక సంగీతం లో క్రమంగా మంచి ప్రావీణ్యం సంపాదించారు.సర్వశ్రీ పండిట్ ఎల్.ఆర్.కేల్కర్ (గ్వాలియర్ ఘరానా) , ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (సితార్) గార్ల వద్ద శిష్యరికం చేసి సితార్ వాయిద్య నైపుణ్యం సంపాదించి తన పదహారో ఏట "సితారంగ్రేటం" చేసారు. తరువాత ఇక ఆ స్వరసితారలహరి అప్రతిహతంగా సాగిపోయింది.
భారతీయ విద్యా భవన్ (1980), నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ (1982), షణ్ముఖానంద సభ (1985), యునెస్కో 40 వ వార్షికోత్సవ సభల్లో (ఢిల్లీ - 1986)కచేరీ ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో..హిందుస్తానీ జుగల్బందీ (సరోద్, ఫ్లూట్ కాకుండా వీణతో కూడా) చేసిన ఘనత వీరికి దక్కుతుంది. 89, 93, 94, 96 ల్లో అమెరికాలో ఇచ్చిన ప్రదర్శనలు ఎంతో మంది రసజ్ఞులను ఉఱ్ఱూతలూగించినాయి. 93 లో అనురాధా పాల్ గారితో హ్యూస్టన్లో తబల జుగల్బందీ, శ్రీకాంత్ చారిగారితో పాలో ఆల్టోలో సితార్ - వీణా జుగల్బంది ప్రేక్షకులని సమ్మోహితులని చేసాయి.అలాగే తానా సభలకు 93లో, 94లో సుమారు గంట నిడివి కల "వెల్ కం సాంగ్ " కి కంపోసర్ గా సేవ అందించారు.
1978లో ఆయన బాక్ గ్రవుండ్ సంగీతం సమకూర్చి, బాంబేలో ప్రదర్శించిన "కుమార సంభవం" అనే నృత్య నాటిక పెద్దలందరిచేత మన్ననలు పొందింది.అలాగే ఆయన 2003లో కూచిపూడి కళా కేంద్రం వారి నృత్యరూపకం "కృష్ణ పారిజాతం" లోని "తులాభారం" అంకానికి స్వరపరిచిన సంగీతం అందరినీ అలరించింది. ప్రఖ్యాత తబల మాష్టారు శ్రీ డేవిడ్ కోర్ట్నీ ( www.chandrakantha.com ) గారితో ఎన్నో సంగీత కచేరీలు చేసారు. గానకోకిల సుశీలమ్మ గారు, జేసుదాసు గారు, వాణీ జయరాం, డాక్టర్ రాజ్ కుమార్ గారు� ఇలా ఎంతో మందితో, వారి సినిమాల్లో, స్టేజి షోల్లో తన సితార్ మధురిమలు పంచుకున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సంగీత కళానిధి గురించి ఎన్నో ఎన్నెన్నో విశేషాలు బయల్పడతాయి.
ఆయన స్వరపరచిన "యమన్" రాగం లోని ఒక సితార్ తళుకు తునక ఇక్కడ విని ఆనందించండి.
"యమన్" రాగంలో - ఒక సితార్ స్వర కల్పన