సకలలోకపాలకుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి పదసన్నిధి తిరుపతిలో పుట్టి పెరిగిన సంగీత కోకిల శ్రీమతి జానకి గారు తన పాటలను మీతో పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా హృదయ పూర్వక కృతజ్ఞతలు.నాలుగో ఏట నుండి సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టిన శ్రీమతి జానకి గారు , ఎస్.వి.మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ నుండి 1995లో బి.యే (మ్యూజిక్) పూర్తిచేసి, 1997లో పద్మావతి యూనివర్శిటీ నుండి ఎం.యే (కర్ణాటిక్- వోకల్) పట్టా పుచ్చుకున్నారు. అద్భుతమయిన గాత్రశుద్ధి కల జానకి గారు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు శ్రీ శబరి గిరీష్ గారి ప్రియ శిష్యురాలు. ఆ పై 1992 లో ఎస్.వి.మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న "మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ" గారి వద్ద సంగీతం నేర్చుకునే అదృష్టం కలిగింది అని, పద్మావతి విశ్వవిద్యాలయం లో "శ్రీమతి ద్వారం లక్ష్మి" గారి వద్ద శిష్యరికం చేసే అదృష్టం లభించింది అని జానకి గారు ఎంతో సంతోషంగా చెపుతారు. 1996 లో మొదలయిన మొదటి కచేరీ తరువాత ఆ గానకోకిల గాత్రం ఎల్లలు లేకుండా అప్రతిహతంగా సుదూర తీరాల వరకు సాగిపోతోంది. ప్రతి తిరుమల, తిరుచానూర్ బ్రహ్మోత్సవాలలో వీరి గాత్రం వినపడవలసిందే.వీరి భర్త శ్రీ జె.ఎస్.ఆర్.ఎ.ప్రసాద్ గారు హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ - Department Of Sanskrit లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అన్నమాచార్య కృతులు అంటే ప్రాణంగా భావించే జానకి గారు ఎంతో మంది పిల్లలకి విద్యాదానం చేస్తున్నారు.ఇలాంటి సంగీత కార్యక్రమాలు ఆవిడ ఇంకా ఎన్నో చేయాలి అని మనసారా కోరుకుంటూ, ఆవిడ అందించిన అద్భుతమయిన ఆణిముత్యాలు కొన్ని విని ఆనందించమని విన్నపము. |