వినుము ధరాధర వరతనయాధృత, వినయా సరస గుణాభినయా ఆధ్యాత్మ రామాయణం (బాలకాండ) |
ఆధ్యాత్మరామాయణ కీర్తనల బ్లాగు నిర్వహించే శ్రీ మల్లిన నరసింహారావు గారు ఈ పై కీర్తన పూర్తి పాఠాన్ని అందించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం వినుము ధరాధర వరతనయాధృత, వినయా సరస గుణాభినయా (ఆధ్యాత్మ రామాయణ కీర్తన - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి) గౌళిపంతు -- ఆదితాళము పల్లవి వినుము ధరాధర వరతనయాధృత, వినయా సరస గుణాభినయా IIవినుII అనుపల్లవి చనువుమీర నన్నడిగిన యీ శుభ, చరితము హతదురితము యిది నిర్గతము IIవినుII రావణాది దుష్టాసుర కోటుల మోవలేక భర పీడితయై భూ దేవి విమల గోరూపము గైకొని శ్రీవిలసిలు బ్రహ్మలోకమునకు ఠీవిగ నేగి విరించి చరణ రా జీవము లశ్రుకణమ్ముల దడుపుచు సావధానముగ మ్రొక్కి వినతయై తా వచ్చుట వినిపించె విశదముగ IIవినుII 1 వనజభవుం డొక ముహుర్తమాత్రము మనమున నంతయు నూహ జేసి క్రొ న్నన విల్తుని తండ్రిని గనుగొనుటకు ముని సుర పరివృతుడై భూసహితము గను చని క్షీర సముద్ర తీరమున ననుపమ, భక్తి వినమ్రుడై హరిని వినుతించెను వేదాంత వాక్యముల ఘన వినయానందములు పురిగొన IIవినుII 2 కోటి సహస్రాంశు సమప్రభచే మాటికి దిక్కులు తేజము, సేయుచు హాటకాంబరము కటిపై వెలుగఁ గి రీటహార కేయూర కాంతులు ల లాట కంఠ బాహువులను దనరగ మేటి కౌస్తుభ శ్రీవత్సములకు నాటపట్టయి చతుర్భుజు డగుచు ని శాటవైరి గనుపట్టె మోదమున. IIవినుII 3 గరుడ వాహనారూఢుడు కమలా ధరణీ యువతీ యుగళ యుతుడు శం ఖ రథాంగ గదా పద్మ విరాజితు డురుతర వనమాలికా భిరాముడు ధర నీరేజ విశాలలోచనుడు పరమామృత కరుణా లోకనుడగు హరి చరణ ద్వయి శిరము సోకగను సరసిజగర్భుడు మ్రొక్కి పలికెనిదె. IIవినుII 4 తనువు మనసు ప్రాణము, లింద్రియములు వినుత నిశ్చయాత్మక మగు మతితో నొనగూర్చి భవత్పద వినతుడ నై తినని సుహృత్పుండరీకమునకు గొని నిరతానందానుభవంబున నెనయువారు భవరహితుల భవ త్రిభు వనముపుట్టి పెరిగిగెడయు, టిది నీ ఘన మాయ గదాయనె పితామహుడు IIవినుII 5 సూరిజనులు వేదాంతమునందలి సారవిచారము చేసి ఘోర సం సారర్పుక్సీడితుల కౌషదం బు దారభక్తి యని పల్కిరి గానయ నారత మతి దయజేయు మనిన విని శౌరి యజుని కరుణార్ద్ర దృష్టిచే నారసి నీ యభిమతము లొసంగుదు గోరుమనిన నుత్సుకుడై పలికెనుIIవినుII6 శ్రీలలనాధిప చిత్తగింపుమీ భూలోకమునను రావణుడనగా పౌలస్త్యుని సుతుఁ డొకడు గలడు సువి శాలమై తగు మదీయ వరంబున మేలుజెంది సురకంటకుడై కడు చాలియున్న వాడతనికి మర్త్యుని చే లయంబు విధియించితి దనుజున నీ వా మనుజుడవై వధింపుమనె IIవినుII 7 వనజోదరు డిట్లనియెను కశ్యప ముని మును నను తనయుని గమ్మని వే డిన నే సమ్మతి పడితి నిపు డతం డిన కులమున దశరథు డైనాడా ఘనునకు కౌసల్యకు పుత్రుడనై జనియించెను జనియోగ మాయయె జనకుని యింట సీత యగును పొ మ్మని చక్రి తిరోభాసము నొందెను IIవినుII 8 సురలకు నిట్లనియెను చతురాస్యుడు హరివాక్యము లెల్ల వింటిరే వా నరుల సృజింపుడు మీ యంశములను పరమేశునకు సహాయము సేయుడు పరమ సమ్మతం బగు ననుచు వసుం ధర నూరడించి నిజ వాసమున కరిగె నలువ శేషాచలవాసున శరణాగత వత్సలు డని పొగడుచుIIవినుముII 9 నిర్గతము=బయలువెడలినది |