వినుమని శ్రీరాముడు తా బలికెను, విశదముదను జేరి
ఆధ్యాత్మ రామాయణం (బాలకాండ)
ఆధ్యాత్మరామాయణ కీర్తనల బ్లాగు నిర్వహించే శ్రీ మల్లిన నరసింహారావు గారు ఈ పై కీర్తన పూర్తి పాఠాన్ని అందించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎక్కడైనా తప్పులు కనపడితే సహృదయంతో సరిదిద్దమని విన్నపం

వినుమని శ్రీరాముడు తా బలికెను, విశదముదను జేరి
(ఆధ్యాత్మ రామాయణ కీర్తన - మునిపల్లి సుబ్రహ్మణ్య కవి)

సావేరి -- ఆది తాళము

పల్లవి
వినుమని శ్రీరాముడు తా బలికెను, విశదముఁ దను జేరి IIవినుII

అనుపల్లవి
జనకజ చే విన్న యనిలజనికి జ్ఞాన - జనక మౌనట్లుగాను మోదము తోను IIవినుII

సమతను ఆత్మనాత్మపరాత్మల జాడలు త్రివిధములు పవనజ
మమతాహంకారకర్తృత్వములన, మరినయది యాత్మ
రమణ ననృతజడదుఃఖములను నీ, రసమయినది యనాత్మ, నిత్యము
విమలము సత్యజ్ఞానానందా, త్మక మిదియె పరాత్మ, మహాత్మా IIవినుII 1

ఆకాశము త్రివిధం బయినట్లు ప, రాత్మ త్రివిధమాయె, దెలియగ
నైకముగాను పరాకారము జ, లాసయ బింబితమైన
చేకొని తదవచ్చిన్నాకాశము, చెలగి భిత్తియందు, నెంతయు
ప్రాకటముగ నిటు ప్రతిబింబితమై, ప్రబలినదీచాయ, శ్రీ యాంజనేయ IIవినుII 2

చాతురిమీరి నఖండాద్వితీయ, చైతన్యము వలన, బింబ
భూతుడై త్రివిధాహంకార విరా, ట్పురుషుడు జూపట్టె
అతనియం దాభాసరూపమయి, భూతేంద్రియ మనో, వృతమయి
ఖ్యాతి గాంచి జీవాత్మయన దనరె, గనుగొను మీజాడ, క్రమముతోడ IIవినుII 3

గుణమయ మాయ కర్తృత్వము పొసంగి, న జీవత్వాది మలినములు
గణుతింప నవిచ్ఛినమైనయ వి కార పరాత్మ, యందు
అనయము నను నారోపణ సేయుదు, ర జ్ఞానులు భువిలో నెఱుగక
అనిశము శక్తి రజతమని భ్రమయుటే, యాభాసమనదగుచు, దెలియనగును IIవినుII 4

చెలగు నవిచ్ఛిన్నత బ్రహ్మము, విచ్ఛేదము కల్పితము, గావున
నలభిన్నులకు పూరణాత్మకు నైక్యము, వలనను జనులచే,
అలఘు తత్్వమస్యాది మహా వా, క్యములచే బ్రకటమై, యలరెడు
వెలయగ నైక్య జ్ఞానము గల్గిన, విద్య మాయమౌను, గుణములతోను IIవినుII 5

పావనులై యీ క్రమ మెఱిగిన మ, ద్భక్తులు మత్సరము జెందుదు
రీ వసుధను భక్తివిహీనులుగ, గర్హితులై దుర్మతులై
కేవలమును శాస్త్రగర్తములబడి, కెరలిభవశతములు, నొందుచు
భావము చెడి సుజ్ఞానదూరులయి, పోవుట నిశ్చయము , నీకేమి భయము IIవినుII 6

పరమ మైన యీ యుపదేశము గో, ప్యమిది భక్తి లేని వారి
కరయు నింద్ర రా, జ్యమొసంగిన నియ్యకు మిది, భవహరము
గరిమ నఖిల వేదాంతసార సం, గ్రహము శుభావహము, కనుకొను
సురుచిర శేషాచలఖర నివా, సుండవై భువిలోను, వెలసినాను IIవినుII 7

క్రితం కీర్తనలో జరిగిన సీతా మారుతి సంవాదము తర్వాత - శ్రీరామచంద్రుడు సీతాదేవి చెప్పినది విన్న మారుతిని చేరి సంపూర్ణ జ్ఞానముతో విశదమయ్యేట్లుగా వినమని ఈ క్రింది విధంగా పలికాడు ఆంజనేయునితో.

సమతను ఆత్మ, అనాత్మ, పరమాత్మ ల జాడలు మూడు విధములుగా ఉంటాయి. మమతా హంకార కర్తృత్వములతో అమరినది - ఆత్మ. అసత్యము, జడము దుఃఖము తో నీరసమయినది ఆనాత్మ. నిత్యమైనది, స్వచ్ఛమైనది, సత్యజ్ఞానానందకమైనది పరాత్మ. ఆకాశం మూడు విధాలయినట్లుగా పరాత్మ మళ్ళీ మూడు విధాలు.