శ్రీమతి శారదాశ్రీనివాసన్ పరిచయం - మొదటి భాగం ప్రసారం తేదీ : 08 march 2008 ముచ్చటించినవారు : శ్రీ సుమనస్పతిరెడ్డి (AIR PEx) |
శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి గురించి ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడ్డ వ్యాసం AndhraJyothy – Sunday Magazine – 08 June 2008 మహానటి సావిత్రి కళ్లలో నవరసాల్ని ఒలికిస్తే ఈమె తన గళంలో పలికిస్తారు. ఆమె చిత్రజగత్తు నేలిన అభినేత్రి అయితే ఈమె ఆకాశవాణి వాచకాభినేత్రి. 1960-90ల మధ్య కాలంలో రేడియో నాటకం విన్నవారు ఆమె వాచకాన్ని, అలలలలుగా వినబడే ఆ నవ్వుని మరిచిపోవడం అసంభవం. పురూరవలో ఊర్వశిగా, సుప్తశిలలో అహల్యగా, కాలాతీతవ్యక్తుల్లో ఇందిరగా, భాగ్యనగరంలో భాగమతిగా, కంఠాభరణంలో సుబ్బలక్ష్మిగా ... కొన్ని వేల పాత్రలకు రేడియోలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన శారదా శ్రీనివాసన్‌గారి జ్ఞాపకాలు ఈ వారం - జ్ఞాపకాలు - 'నా నవ్వు చలంగారికి ఎంతో నచ్చేదట' -శ్రీమతి శారదా శ్రీనివాసన్ నేను 1935లో పుట్టానట. నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్‌మెంటులో పనిచేసేవారు. ఆయనకి తరచూ బదిలీలు అవుతుండేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయానికి మేం తణుకులో ఉన్నాం. అప్పుడు నాకు 12 ఏళ్లుం టాయి. ఇంటిదగ్గరే శేషబట్టర్ వెంకట అప్పలాచార్యులుగారి వద్ద వీణ, గాత్రం నేర్పించేవారు. నాన్నగారికి ఆడపిల్లలు బయటకి వెళ్లి చదువుకోవడం అంతగా ఇష్టం ఉండేది కాదు. అమ్మ బలవంతం పైన జాతీయోద్యమ పద్ధతిలో నడిచే ఓ స్కూల్లో చేర్పించారు. అందులో ఇంగ్లీషు ఉండేది కాదు. తెలుగుతో పాటు హిందీ, సంస్కృతాలు ఉండేవి. క్లాసులో నేను పద్యాలు చదువుతున్నప్పుడు ఉచ్చారణ గమనించి నా వాచకంలోని స్పష్టతను మెచ్చుకునేవారు టీచర్లు. ఒకసారి స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని నాటకాల్ని వేయించారు. నా ఒక్కదానికే నాలుగు నాటకాల్లో ప్రధాన పాత్రల్ని ఇచ్చారు. చంద్రగుప్తలో చంద్రగుప్తుడుగా, ఒక సంస్క¬ృత నాటకంలో వత్సరాజుగా, డాన్స్‌బాలేలో వసంతుడుగా, అమ్మ నాటకంలో అమ్మ పాత్ర. అన్ని నాటకాల్లోనూ నాకే ప్రథమ బహుమతి వచ్చింది. ఆ సందర్భంలో మా స్కూలుకు వచ్చిన చెరుకువాడ నరసింహం పంతులుగారు 'నీకు మంచి భవిష్యత్ ఉందమ్మాయ్' అని దీవించారు. ఆకాశవాణిలో ప్రవేశం బెజవాడలో హిందీ మహావిద్యాలయంలో ప్రవీణ కోర్సు చదివేదాన్ని. విద్యార్థులతో ఒక హిందీ నాటకం వేయించమంటూ బెజవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా కాలేజీకి ఒక కాంట్రాక్టు పంపారు. వాచకం బాగుందనుకున్న కొందరు విద్యార్థులను రేడియో స్టేషన్‌కి తీసుకెళ్లారు. అందులో నేనూ ఉన్నాను. రేడియో వాళ్లిచ్చిన స్క్రిప్ట్‌ని తీసుకుని రికార్డింగ్ రూంలో చదివి బయటకి వచ్చాను. 'ఇప్పుడు చదివిన అమ్మాయ్ ఎవరూ?' అంటూ వచ్చారు ఒకాయన. నేనేనని తెలుసుకుని 'బాగా చదివావ్' అంటూ మెచ్చుకున్నారు. ఆయన జనమంచి రామకృష్ణగారని తర్వాత తెలిసింది. ఆశ్చర్యంగా మా కాలేజీ తరపు నాటకం ప్రసారం కాకముందే మరో హిందీ నాటకంలో వేయమని నాకు కాంట్రాక్టు పంపారు. రేడియోలో అవకాశాలు వస్తుండడంతో బెజవాడలో ముసునూరు వెంకటరమణమూర్తిగారి వద్ద కర్నాటక, లలిత సంగీతాల్ని నేర్పించారు. ఆ తర్వాత పింగళి లక్ష్మీకాంతంగారు నాచేత కొన్ని సంస్కృత నాటకాలు కూడా వేయించారు. నా వాచకం విన్న బాలాంత్రపు రజనీకాంతరావుగారు తెలుగు నాటకానికి నన్ను రికమండ్ చేస్తూ కాంట్రాక్టు పంపమన్నారట. అలా నేను తెలుగులో తొలిసారిగా 'కర్ణుడు' నాటకంలో కర్ణుడి భార్యగా నటించాను. అలా తరచూ బెజవాడ రేడియోలో నాటకాల్ని వేస్తూ ఉండేదాన్ని హైదరాబాదులో ఉద్యోగం 1959లో హైదరాబాదు రేడియో స్టేషన్‌లో డ్రామా ఆర్టిస్టుగా ఉద్యోగం వచ్చింది. అప్పుడే కొత్తగా భక్తిరంజని కార్యక్రమాన్ని ప్రారం భించారు. వింజమూరి వరదరాజ అయ్యంగారు, మంచాల జగన్నాథరావుగార్లు నిర్వహించే భక్తిరంజనిలో నేతి శ్రీరామశర్మ, పాకాల సావిత్రి, వి.వి.కనకదుర్గలతో కలిసి పాడేదాన్ని. కార్మికుల కార్యక్రమంలో రామయ్య, పానకాలు, సీతక్కలనే మూడు పాత్రలుండేవి. వారి ముచ్చట్లని చాలామంది శ్రోతలు శ్రద్ధగా విని ఆనం దించేవారు. దుర్గాచలంగారు, రఘురామ్‌గారు, నేనూ అందులో పాల్గొనేవాళ్లం. సంభాషణల్ని నాయని సుబ్బారావుగారు రాసేవారు. ఇది 'లైవ్' ప్రోగ్రామ్ కాబట్టి కార్మికుల కార్యక్రమం టైముకు ఎంత పనిలో ఉన్నా మా మాటల్ని వినడానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు స్టూడియో దగ్గరకి వచ్చేసేవారు. నాగార్జునసాగర్ డామ్ నిర్మాణం జరిగే రోజులవి. కార్మికుల కార్యక్రమంలో వచ్చే ముచ్చ ట్లని కూలీల భోజన విరామంలో మైకుల ద్వారా విన్పించేవారట. అప్పుడప్పుడు ఈ కార్యక్రమం కోసం నాగార్జునసాగర్ వెళ్లే మా సిబ్బందితో 'కార్మికుల కార్య్రక్రమం తప్పకుండా వింటాం. అందులోని సంభాషణలు మాకు చాలా ఇష్టం' అని మెచ్చుకునేవారట కూలీలు. నేను హైదరాబాదు వచ్చిన మొదట్లో డా.పి.శ్రీదేవిగారి 'కాలాతీతవ్యక్తులు' నాటకం ప్రసారమైంది. అందులో ఇందిర పాత్రని వేశాను. రిహార్సల్స్ జరిగే సమయంలో గోరాశాస్త్రి, శ్రీదేవిగార్లు వచ్చి కూర్చునేవారు. శ్రీదేవిగారు చాలా సున్నిత మనస్కురాలు. చాలా సౌమ్యంగా మాట్లాడేవారు. ఇందిర పాత్రలో నా పర్ఫామెన్స్‌ని ఇద్దరూ మెచ్చుకునేవారు. నండూరి విఠల్‌గారితో నేను వేసిన నాటకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. వారితో కలిసి సీతాపతి, కాలకన్య, రాగరాగిణి లాంటి వందలాది నాటకాల్లో నటించాను. మునిమాణిక్యం నరసింహారావుగారి 'కాంతం కథలు' నాటికలుగా బాగా పేరు తెచ్చాయి మాకు. బెజవాడ గోపాలరెడ్డిగారు 'సీతాపతి' నాటకాన్ని బాగా ఇష్టపడి పదేపదే ప్రసారం చేయమని కోరేవారు. రావూరి సత్యనారాయణగారు రాసిన 'పరితాపం'లో విఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావుగారితో, సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారి 'పెద్దమనుషులు'ల్లో ప్రముఖ నటులు గుమ్మడిగారితో నటించే భాగ్యం నాకు కలిగింది. గుమ్మడిగారు నా వాచకాన్ని బాగా ఇష్టపడేవారు. వారు నాటకం వేయడానికి వచ్చినప్పుడు 'మీతో కలిసి నటించే అవకాశం ఇప్పించమని నేనే రేడియో వారిని కోరానమ్మా' అన్నారు నవ్వుతూ. పి.వి.నరసింహారావుగారు మరాఠీనుండి తెలుగులోకి అనువాదం చేసిన నవల 'ఎవరు లక్ష్యపెడతారు?'. విధవ జీవితంలోని విషాదాన్ని తెలిపే వస్తువు అది. ఈ నవలని నండూరి విఠల్‌గారు నాటకీకరణ చేశారు. దీనిలో విఠల్‌గారితో పాటు నేను నటించాను. పి.వి.గారు అప్పుడప్పుడు రిహార్సల్స్‌కు వచ్చి కూర్చునేవారు. తరచూ నా వాచకాన్ని ప్రశంసిస్తూ ఉండేవారు. హైదరాబాదులో ఏ రాజకీయపరమైన మీటిం గులు జరిగినా సభలో వందేమాతరం, జనగణమన పాడ్డానికి రేడియో ఆర్టిస్టులనే పిలిచేవారు. పాకాల సావిత్రి, వి.వి. కనకదుర్గగార్లతో పాటు నేనూ వెళ్లేదాన్ని. అలా ప్రధాని నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్ గార్ల వంటి ఎందరో ప్రముఖుల సముఖంలో పాడటం నాకు దొరికిన భాగ్యంగా భావిస్తాను. నాటక నిర్వాహకురాలిగా రేడియో అక్కయ్య న్యాపతి కామేశ్వరమ్మగారు నన్ను రంగనాయకమ్మగారి 'బలిపీఠం' నవలని నాటకంగా 'ప్రొడ్యూస్' చేయమన్నారు. నాకు నిర్వాహణ కొత్త కనుక నండూరి విఠల్‌గారు రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్‌ల్లో నాకు సహాయం చేశారు. నాటకం ప్రసారమైన ప్రతిసారీ నిర్వహణలో నా పేరు వినిపించేది. నిజానికి చాలావరకు చేసింది విఠల్‌గారు. పూర్తిగా నేనే చేసినట్టు నా పేరు విన్పిస్తే చాలా గిల్టీగా ఉండేది. అప్పుడే స్వంతంగా అన్నీ నేర్చుకోవాలనే పట్టుదల కలిగింది. తరువాత 'పురానా ఖిల్లా' నాటకాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఇందులో రాజుల ఆత్మలు మాట్లాడుకుంటాయి. ఆ మాటల మధ్యలో ఎఫెక్ట్సు కోసం ఆకాశవాణిలో పనిచేసే ఒక ఇంజనీర్ సహాయంతో సౌండు మిక్సింగులు స్వంతంగా చేశాను. స్టేషన్ డైరెక్టరుగా పనిచేసి రిటైరయిన అయ్యగారి వీరభద్రరావుగారు పేపర్లో కాలమిస్టుగా ఉండేవారు. నేను చేసిన 'పురానా ఖిల్లా' సౌండ్ ఎఫెక్ట్సు గురించి ప్రత్యేకంగా మెచ్చుకుంటూ రాయడంతో నాపై నాకు నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఆయన ఎవరినీ అంత త్వరగా మెచ్చుకునేవారు కాదు. కె.చిరంజీవి గారు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం చాలా శ్రద్ధ వహించేవారు. నెల్లూరి కేశవస్వామిగారి 'నిరీక్షణ' నాటకంలో రైల్వే సౌండ్ ఎఫెక్ట్స్ అవసరమైతే రైల్వేవారితో ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని చర్లపల్లి దాకా నేను, కె.చిరంజీవిగారు వెళ్లి రికార్డింగ్ చేసుకువచ్చాం. 'ఊరోళ్లు మేల్కొంటున్నారు' నాటకంలో కమ్మరి పనిలో ఉండే కొలిమి, సుత్తి శబ్దాలకోసం కమ్మరి వాళ్ల దగ్గరకు వెళ్లి సౌండ్ రికార్డింగ్ చేసేవాళ్లం. ఈ రెండు నాటకాల్ని కె.చిరంజీవి గారే నిర్వహించారు. గణేష్‌పాత్రో రాసిన నాటకాలు విశాఖపట్నం కేంద్రం నుండి వస్తున్నప్పుడు ఆ మాండలికాన్ని చాలా శ్రద్ధగా వినేదాన్ని. బలివాడ కాంతారావు గారి 'దగాపడిన తమ్ముడు'లో ఉత్తరాంధ్ర మాండలీకాన్ని పలకగలిగాను. దాశరథి రంగాచా ర్యగారి 'చిల్లరదేవుళ్లు' నాటకాన్ని నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డైలాగ్ మాడ్యులేషన్ సరిగా రావాలని అన్ని పాత్రలకీ తెలంగాణ కళాకారుల్నే బుక్ చేశాను. దాశరథిగారి కోరిక మేర అందులోని వనజ పాత్రని మాత్రం నేనే వేశాను. ఏ మాండలీకంలో సంభాషణ చెప్పినా ఉచ్చారణలో కృతకం లేకుండా ప్రయత్నించాను. 'పురూరవ నాటకం వస్తోంటే నన్నెవరూ డిస్టర్బ్ చేయకుండా రేడియోని నా గదిలోకి తీసుకెళ్లి శ్రద్ధగా విన్నానమ్మా' అంటూ ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆత్రేయగారు అన్నారు. ఆ సందర్భంలోనే నా వాచకాన్ని మెచ్చుకుంటూ అందుబాటులో ఉన్న చిన్న పేపరుపైన అలవోకగా ఒక గేయకవితను రాసి నాకు కానుకగా ఇచ్చారు. కలదు ఆ శారదకు వీణ కరములందు కలదు ఈ శారదకు వీణ గళమునందు కలదు ఆ శారద కవుల కవితలందు కలవు కవితలే ఈమె వా గమృతమందు శారద కాని శారదకు, శారదలోగల సత్కళా సుదా సారదకున్ విశారదకు సాదర పూర్వ నమస్సుమాంజలుల్ (ఈ కవిత జూన్ 19, 1977న రాసింది) పురూరవ నాటకాన్ని చలంగారికి తీసుకెళ్లి వినిపించామని, ఆయన ఊర్వశి పాత్ర వేసిన నన్ను ఎంతగానో మెచ్చుకున్నారని అరుణాచలం వెళ్లివచ్చిన మా సిబ్బంది చెప్పేవారు. చలంగారు నిజంగా బాగుందని అని ఉంటారా? అనిపించేది. ఆ మధ్య 2003లో ఒకసారి విశాఖపట్నం వెళ్లినప్పుడు భీమ్లీలో సౌరిస్‌గారిని కలిశాను. మేం వెళ్లేసరికి సౌరిస్‌గారు ధ్యానంలో ఉన్నారు. తర్వాత కాసేపటికి కళ్లు మూసుకునే ఎవరొచ్చారని అడిగారు. నాతో వచ్చినవాళ్ల పేర్లు చెబుతూ నా పేరు చెప్పగానే హఠాత్తుగా కళ్లు తెరిచి, నావైపు చూస్తూ నా చెయ్యి పట్టుకుని 'ఎవరూ? పురూరవ ... ఆ శారదా శ్రీనివాసనేనా...' అన్నారు. అవునన్నాను నేను. 'నాన్నకి మీ నవ్వు ఎంతో ఇష్టం...' అన్నారావిడ. సౌరిస్‌గారి మాటలకు చాలా సంతోషం వేసింది. చలంగారు నన్ను మెచ్చుకున్నది నిజమే నన్న నమ్మకం కల్గిందప్పుడు. నటించిన వేల నాటకాలలో కొన్ని పాత్రలు మనసుపై చాలా ప్రభావం చూపేవి. రాజా ఈడిపస్, పాప పరిహారం, సుప్తశిల, మెదియా, పతితవ్రత లాంటి నాటకాలు నన్ను చాలా కలతకు గురిచేశాయి. మనసుని పిండేసే పాత్రలవి. రాజా ఈడిపస్ తన రాజ్యంలోని కల్లోలానికి, క్షామానికి కారణాలు కనుగొనే క్రమంలో తను తన తల్లినే వివాహమాడి పిల్లల్ని కన్నాననే నిజం తెలుస్తుంది. ఆ తల్లి పాత్ర 'జొకాస్తా' నేనే వేశాను. ఆ పాత్ర నన్ను నీడలా వెంబడించేది. రాత్రుళ్లు నిద్రపట్టనిచ్చేది కాదు. అలాగే గౌతముడి శాపం వల్ల శిలా రూపాన్ని ధరించే అహల్య పాత్రపట్ల నాకెంతో సానుభూతి. తిలక్ రాసిన సుప్తశిలలోని అహల్య పాత్ర నేను వేసిన అన్ని పాత్రల్లోకి నాకు ఎక్కువ తృప్తిని కలిగించిన పాత్ర. నవలా స్రవంతి కార్యక్రమంలో శివరాం కారంత్ గారి 'మరణానంతరం', రంగనాయకమ్మ గారి 'స్త్రీ', ఉప్పల లక్ష్మణరావుగారి 'అతడు ఆమె', పిలకా గణపతి శాస్త్రిగారి 'గృహిణి' లాంటి ఎన్నో నవలల్ని చదివాను. నేను చదువుతుంటే నాటకం చూస్తున్న అనుభూతి కలిగేదని శ్రోతలు ఉత్తరాలు రాసేవారు. తమ్మారెడ్డి, కమలాకర కామేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావుగార్లు సినిమాలో నటించమని కోరిన సందర్భాలూ ఉన్నాయి. నాకెందుకో సినమాల్లో న్యాయం చేకూర్చలేనని అనిపించేది. కాని ఒకసారి దుక్కిపాటి మధుసూదనరావు 'బంగారు కలలు'లో వహీదా రెహమాన్‌గారికి నా వాయిస్ ఇమ్మని అడిగితే ఇచ్చాను. మరోసారి అక్కినేని కుటుంబరావు, ఓల్గా గార్ల 'తోడు'లో గీత గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. 1985లో ప్రాంభించబడిన బిర్లా ప్లానిటోరియంలో మొదట్నుండీ తెలుగు వ్యాఖ్యానాన్ని చదువుతున్నాను. సినిమాలకున్నంత క్రేజ్ అప్పట్లో నాటకానికీ ఉండేది. రేడియో మూలమూలలకీ వెళ్లే మాధ్యమం. సినిమా వెళ్లని చోట కూడా రేడియో వినిపిస్తుంది. హైదరాబాదు చూడ్డానికి వచ్చినవారు ఆకాశవాణికి వచ్చి 'మీరేనా శారదా శ్రీనివాసన్ ... మిమ్మల్ని చూడ్డానికే వచ్చామమ్మా' - 'మేం ప్రవాసాంధ్రులం. రాష్ట్ర్రానికి దూరంగా ఉంటాం. తరంగాలు సరిగా అందుకోలేమేమోనని మీ నాటకం కోసం గంటముందునుండే రేడియో ట్యూన్ చేసుకుని పెట్టుకుంటాం' అనేవారు. నా నాటకాల్ని మెచ్చుకుంటూ ఎన్నో వేల ఉత్తరాలు వచ్చేవి. శ్రోతల ప్రశంసలకు మించి ఆనందం ఏముంటుంది? నాటకాల్లో నటించడం వల్ల ఎంతో ఎదిగాను. ఎన్నో మనస్తత్వాలను తెలుసుకోగలిగాను. నన్ను నేను సంస్కరించుకోవడానికి నాటకం ఉపయోగపడింది. గొప్పవారి స్క్రిప్టుల్ని చదివే అవకాశం కలిగింది. అందుకు నేనెంతో గర్విస్తాను. ఆకాశవాణి అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల భువనవిజయంలా కొలువుతీరి ఉండేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, పింగళి లక్ష్మీకాంతం, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, గోపీచంద్, బందా కనకలింగేశ్వరరావు గార్ల వంటి ఎందరో మహామహులు ఉండేవారు. వారందరి మధ్యన నేనూ ఉన్నానన్న జ్ఞాపకమే గొప్ప మధురమైన అనుభూతి. చిరునామా: 204, సీతారాం ఎంక్లేవ్, 3-6-671, స్ట్రీట్ నెం: 10, హిమాయత్‌నగర్, హైదరాబాదు -29, సెల్: 94410 10396 - గొరుసు జగదీశ్వర రెడి - http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/2-3/memories |