శ్రీ బూదరాజు రాధాకృష్ణ జ్ఞాపకాలు ఆకాశవాణి హైదరాబాదు శ్రీ బూదరాజు రాధాకృష్ణ ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్ పాత్రికేయుడు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది. 1932 మే 3 న ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామంలో రాధాకృష్ణ జన్మించారు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా అందుకున్నారు. చీరాల వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టరుగా పనిచేసారు. 1988 లో తెలుగు అకాడమీ నుండి విరమణ చేసాక, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాలుగా పదేళ్ళకు పైగా పనిచేసారు. ఈనాడు పత్రికలో పుణ్యభూమి శీర్షికకు సి.ధర్మారావు పేరుతో వందలాది వ్యాసాలు రాసారు. |