శ్రీమతి దుర్గాభాస్కర్ పరిచయం
ప్రసారమైన తేదీ : ???
పరిచయకర్త శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి (AIR PEx)
ఆకాశవాణి లో మొదట ట్రాన్స్‌మిషన్‌ ఎక్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవనాన్ని ప్రారంభించిన శ్రీమతి దుర్గాభాస్కర్ ఆకాశవాణి హైదరాబాదు స్టేషన్ డైరెక్టరుగా ఉద్యోగ విరమణ చేసారు.

జూన్ 1,2009 న ఆంధ్రప్రభలో ప్రచురించబడ్డ వీరి పరిచయం ఈ క్రింద చూడవచ్చు.
సౌజన్యం: ఆంధ్రప్రభ

ఆకాశ'వాణి' రాణి - దుర్గాభాస్కర్‌
Mon, 1 Jun 2009
( http://www.andhraprabhaonline.com/leaders/article-5722 )

విజయవాడ,హైదరాబాదులలో తొలి తెలుగు మహిళా స్టేషన్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఘనత శ్రీమతి దుర్గా భాస్కర్‌ గారిదే. నాతో మాట్లాడుతూనే కమ్మగా పాడుతూ వివిధ గొప్ప సంగీత విద్వాంసులతో తన అనుభవాలను వివరించా రామె. ''మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ''నాగరాజు గారి అమ్మాయి'' అని పిలుస్తారు. అమ్మానాన్న వలనే నేనింత దాన్ని అయ్యాను. ఆపై అత్తవారింటి ఆప్యాయత, భర్త, పిల్లల సహాయ సహకారాలతో ఇటు ఉద్యోగం, అటు సంగీత సాహిత్యాల్లో కృషిచేయగలిగాను'' అంటారామె. స్త్రీ తన కాళ్లపై తాను నిలబడాలి అనేది ఈమె అభిప్రాయం.

తండ్రి ఈదర నాగరాజు ప్రముఖ సంగీత విద్వాంసులు వాగ్గేయకారులు. చిదంబరం అన్నామలై విశ్వ విద్యాలయం నుండి సంగీతభూషణం పట్టభద్రులు. గాత్రం, వీణ, మృదంగ వాద్యంలో నిష్ణాతులు. హరికథ, బుర్ర కథలు రచించి దండమూడి రామ్మోహన్‌రావుగారు ఒకరు. తల్లి శ్రీమతి లక్ష్మీనర్సమ్మ గాయని, వీణ వాదకు రాలు. ఈమెకు చెల్లి, తమ్ముడు ఉన్నారు.

చిన్నారి దుర్గ పువ్వుపుట్టగానే పరిమళించింది. బంగా రానికి తావి అబ్బినట్టు తరతరాల కుటుంబ సాంప్ర దాయం,సంగీత సాహిత్యాలు ఈమెకు ఉగ్గుపాలనాడే అబ్బాయి. ఇక ఈమె విద్యాభ్యాస వివరాలలోకి వెళితే ఏలూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో, అదే కాలేజ్‌ బి.ఎస్సీ, హైద్రాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ నించి బి.ఇడి, భారతీయ విద్యాభవన్‌ నుండి సంస్కృత కోవిద, మద్రాసు యూనివర్సిటీ నుంచి తమిళంలో డిప్లమా, భారతీయ విద్యాభవన్‌ నుంచి జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లమా పొందారు. ఇక హైద్రాబాద్‌ ప్రభుత్వ సంగీత కళాశాల నించి కర్ణాటక సంగీతంలో డిప్లమా పొందారు.

1964-65లో హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ డైరెక్టరేట్‌లో ఆపై హైద్రాబాద్‌ సెంట్రల్‌ స్కూల్లో టీచరుగా పనిచేశారు. 1967-75 దాకా ఆకాశవాణి ట్రాన్స్‌మిషన్‌ ఎక్జిక్యూటివ్‌గా 1975-84 ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్‌గా, 1985-93 దాకా అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌, స్టేషన్‌ డైరెక్టర్‌ ఆపై 1999 నించి ఎ.ఐ.ఆర్‌. సెలక్షన్‌ గ్రేడ్‌ డైరెక్టర్‌గా అంచెలంచలుగా ఉన్నత శిఖరాలు చేరారు.

ఆరేళ్ల చిన్నారి దుర్గ వేదికపై బుర్రకథ చెప్పి అందర్నీ మెప్పించిన ప్రతిభాశాలి. కర్ణాటక, లలిత, జానపద సంగీత గాయనిగా బాల్యం నించే పలుపోటీల్లో పాల్గొని ఎన్నో బహు మతులు గెలుచుకున్నారు. వీటిలో ఎ-గ్రేడ్స్‌ పొందారు. తల్లి ప్రోత్సాహంతో భక్తి సంగీతాలాపన అన్నిట్లో పాల్గొనటం, ధైర్యం అలవడ్డాయి. 1960లో పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సంగీత పోటీల్లో గాత్రసంగీతం జూనియర్స్‌లో ప్రథమ బహుమతి, 1966లో హైద్రాబాద్‌లో జరిగిన అంతర్‌ కళా శాలల పోటీల్లో బి.ఇడి విద్యార్థినిగా కర్ణాటక గాత్రంలో ప్రథమ బహుమతి, జానపద గాయనిగా ఎం. నరసింహ మూర్తితో కలిసి తొలి గళం విప్పి మంచి జనాదరణ పొందిన జానపదగాయనిగా ఖ్యాతి గావించారు

నాటక రంగంలో ఆకాశవాణి ఎ-గ్రేడ్‌ డ్రామా ఆరిస్టు. నాటక రచయిత్రి, ప్రయోక్త, దర్శకురాలిగా రేడియో నాటకాల్ని రూపొందించారు. అనేక నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నట శిక్షణా శిబిరం, మీడియా వర్క్‌ షాప్‌ ఆన్‌ యాక్టింగ్‌ 2001లో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హిందీలో కూడా పలు జాతీయ నాటకాల అనువాదం 1994 జమీన్‌ రైతు పత్రికలో ప్రముఖ పాత్రికేయులు గిద్దలూరి గోపాలగారి వంటి ప్రముఖుల ప్రశంసలందారు. ఆకాశవాణి జాతీయ నాటకాల అనువాదం, నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రఖ్యాత తమిళరచయిత తురైవన గారి తమిళనాటకాన్ని తెలుగులోకి అనువదించి నిర్వహించి మద్రాస్‌ కేంద్రం నించి ప్రసారం చేశారు. తమిళంలో కూడా సంచికా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఆకాశవాణి జాతీయ వార్షిక పోటీలకి 1994లో రచించి రూపొందించిన 'నిషిద్ధరవళి' సంగీత రూపకం ప్రత్యేకవిశిష్ట ప్రశంసాపత్రాన్ని పొందింది. ఒక నర్తకి బాహాంతర జీవన సంఘర్షణను సంగీత వాద్యాలతో లయించిన అనుభూతి చిత్రం నిషిద్ధ రవళి...ధ్వని చిత్రంగా శ్రోతల ప్రశంస లందు కుంది ఆ ప్రోగ్రాం.'అమ్మా నన్ను చంపకు' నాటక నిర్వ హణకు 1993 ఎఐఆర్‌ జాతీయ వార్షిక పోటీల్లో ద్వితీయ ఉత్తమరేడియో నాటకం బహుమతి లభించింది.

ఇక ఆకాశవాణిలో హైద్రాబాద్‌, మద్రాస్‌ అహ్మదా బాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో వివిధ హోదాల్లో పని చేసి ఆఖరికి హైద్రాబాద్‌ ఆకాశవాణి స్టేషన్‌ డైరెక్టరు, రాష్ట్ర ప్రాంతీయ కేంద్రాల అధికారిగా బాధ్యతలు నిర్వ హిస్తూ, కథ, సంగీత సాహిత్యాలు, నాటకం, గేయాలు ఎన్నో రూపొందించి శ్రోతలకు దగ్గరైనారు. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను దక్షతతో నిర్వహించేరీమె. ఈ మానపు పాటల రచయిత్రిగా, గాయనిగా తెలుగు ప్రజలకి సుపరి చితులు. 'నాదేశం నవ్వుతున్న నందనాల సుమగీతం, పాద పముల పూజించె పుణ్యభూమి మనదిరా ఒక్క మొక్క నాటరా'' మొదలైనవి పండిత పామ రుల నాల్కపై ఆడాయి. నవలా స్రవంతి ధారావాహికంగా చదివి ప్రసారం చేయటంలో, ఆ ప్రోగ్రాంకి హైదరాబాద్‌-ఎలో టాప్‌ టెన్‌ ప్రోగ్రాంలలో మొదటి స్థానం లభించడం ఇంకో విశేషం. ఆకాశవాణి శిక్షణా సంస్థనిర్వహించే, శిక్షణా తరగతుల ఉద్యోగులకు, రేడియో సంగీత ప్రోగ్రాంల నిర్వహణ, సమర్ప ణలపై అనేక సార్లు వివిధ కేంద్ర ఉద్యోగులకు చక్కటి శిక్షణ ఇచ్చి ఒక ఒరవడిని ప్రవేశపెట్టి రేడియోకి ఒక గౌరవం హోదా ఎక్కువ అయ్యేలా చేశారు. వివిధ రేడియో ప్రకటనలకు రచనలు చేయటమే గాక గాత్ర ధారణ చేసి వీనుల విందు చేశారు. జానపద గేయాల్లో సంవాదగేయాల ప్రత్యేకత, వాటిలోని హాస్యాన్ని వివరించి వినోదాన్ని అందించే రేడియో రూపకం, అత్తాకోడళ్ల ప్రేయసి, ప్రియుల,వదినామరదళ్ల,భార్యభర్తల, సవతుల సంవాదాన్ని పురాణాల నుంచి తీసుకుని జానపదగేయాల్తో ఏర్చి కూర్చిన ప్రత్యేక రూపకం 2008 డిసెంబర్‌లో ఆకాశవాణి హైదరా బాదు నించి ప్రసారమై పలు ప్రశంసలందుకుంది. ఇంతకు ముందు ఇలాంటి రూపకం రేడియోలో ఎక్కడా ప్రసారం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సంగీత కార్యక్రమం లో ఆహుతులైన రసజ్ఞుల సమక్షంలో ఈమె ఆలపించిన గేయాల్ని పత్రికలు కూడా ప్రశంసించాయి. జానపద సినిమా సంగీతాన్ని సోదా హరణం వివరిస్తూ చిక్కడపల్లి త్యాగరాజగానసభలో కొని యాడారు.

డా. కె. రుక్నుద్దీన్‌ మూల రచన పాటలు, సామెతలు, పొడుపుకథలు, అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు ఎలా ఇమిడి ఉన్నాయో వివరిస్తూ, ఈమె 13 భాగాలు ధారావాహికగా రేడియో రూపక రచన, గానం, వ్యాఖ్యానం చేయటం, కొత్త పుంతనే చెప్పొచ్చు. జులై 2007లో ఆంగ్ల హిందీ వివరాల్తో ఈమెగానం చేసిన ఆంధ్రప్రదేశ్‌ జానపదగేయాలు ఢిల్లిdనించి మనదేశంలోని అన్ని రేడియో కేంద్రాలు రిలేచేయటం, ఇందు లో విశేషం. వింజమూరి సీత, అనసూయ, నర్సింహ మూర్తి గార్నలో ఆమె ఎన్నో పాటలు పాడారు.

మీరు ఆకాశవాణిలో ప్రవేశ పెట్టిన కొత్త అంశాలేవి?

''ముందుచూపు'' అనే ఎయిడ్స్‌ పై అవగాహన కలిగించే ధారావాహిక నిర్వహణ 2. ఒక తీర్పు-ఒక మార్పు అనే సీరియల్‌. ఒక ''కాల రేఖలు అని తెలంగాణా మాండలీ కంలో సీరియల్‌ నిర్వహణ, పాత్రధారణ గాయనిగా శ్రోతల ప్రశంసలందుకోటం ఇంకోవిశేషం. 9 డిసెంబర్‌ 2008న డాక్టర్‌ సాయికృష్ణ యాచేంద్రగారి గేయావధానంలో పృచ్చకురాలిగా తెలుగు భాషా ఉత్సవాల్లో పాల్గొన్నాను.''ఈ వారం అతిథి'' డాక్టర్ల సలహాలు ఇంకా కొన సాగుతు న్నాయి.

మీరు నిర్వహించిన వివిధ హోదాలగూర్చి చెప్తారా?

తప్పకుండా 1) 1986-88 సెంట్రల్‌ స్కూలో నవసేన్‌ బాగ్‌ విశాఖపట్నం మేనేజింగ్‌ కమిటీలో సభ్యత్వం. 2) 1987 విశాఖపట్నం కేంద్రవ్యవసాయ మంత్రిత్వశాఖవారి గోష్ఠికి రిసోర్స్‌ పర్పస్‌ 3) విజయవాడ సిద్ధార్థ కళాపీఠం అద్వైజరీ కమిటీ సభ్యత్వం 4) విజయవాడ బాలభవన్‌ సావనీర్‌ కమిటీ అధికార సభ్యురాలు 5) ఒంగోల్‌ జిల్లా అగ్రోహార్టీ ఇండిస్ట్రియల్‌ ఎక్జిబిషన్‌లో సభ్యత్వం, 6) 1993 ఆూూ| విజయవాడ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యత్వం 7) హైదరాబాదు లిటరసీ కమిషన్‌ గొష్ఠుల్లో విశిష్టవక్త 8) 1998-99 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ ఉత్తమ మహిలా జర్నలిస్టు ఎంపిక కమిటీ అధ్యక్ష స్థానం 9) ప్రభుత్వ సాంస్కృతికశాఖ సహకారంతో రాష్ట్ర సాంస్కృతిక మండలి 2002లో నిర్వహించిన ''ప్రసార మాద్యమాలు- రచనా విధానం''సదస్సులో రేడియో రచనా విశ్లేషణ 10) 2002-2003లో డా.బి.ఆర్‌. అంబేత్కర్‌ సార్వత్రియ విశ్వ విద్యాలయం ఉమెన్స్‌ డెవలప్‌మెంట్‌ ఎక్స్‌ టన్షన్‌ సెంటర్‌ ఎడ్వైజరీ కమిటీ సభ్యత్వం. 11)ఆఫ్రో ఆసియా క్రీడల మెంబర్‌ మేనేజింగ్‌ కమిటీసభ్యురాలు.

మీరందుకున్న సన్మానాలు-అవార్డుల గూర్చి చెప్తారా

అలాగేనమ్మా! ''అమ్మా, నన్ను చంపకు'' నాటక నిర్వహణకు 1993 ఆకాశ వాణి జాతీయ వార్షిక పోటీల్లో ద్వితీయ ఉత్తమరేడియో నాటకం బహుమతి లభించింది. 1994లో నిషిద్ధరవళి సంగీత రూపకానికి ప్రత్యేక విశిష్ట ప్రశంసా పత్రం లభించింది. పద సంగీత అభివృద్ధికి చేసిన కృషికి గాను 1994లో మచిలీపట్టణం పదసాహిత్య పరిషత్‌ విశిష్ట సత్యత్వపురస్కారంతో గౌరవించింది. అభినందన -సుకన్య ఆర్ట్‌ ధియేటర్స్‌, హైదరాబాదు వారు అంతర్జా తీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభగల మహిళా అధికారిగా 6.2.2003న త్యాగరాయ గానసభలో సన్మా నించారు. 28.5.2003న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా భాషా పుర స్కారం, ఆలాపన సాంస్కృతిక సంస్థవారి సత్కారం, కిన్నెర ఆర్ట థియేటర్స్‌, మద్రాసు తెలుగు అకాడమీ, అమె చ్యుర్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ సింగర్స్‌ ఆర్గనైజేషన్‌ వారి నుంచి సన్మానాలు పొందాను.

మీ రచనలు పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి గదా? వాటి వివరాలు చెప్తారు?

లెక్కలేనన్ని కథలు, కవితలు, వ్యాసాలు వివిధ పేపర్లు, పత్రికల్లో వచ్చాయి. వస్తున్నాయి. ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రదేశ్‌, యోజనలలో ఎన్నో వచ్చాయి. పుస్తక సమీక్షలు, సంగీతకార్యక్రమాల సమీక్షలు ప్రచురింపబడ్డాయి. నాకు బాగా నచ్చిన కవిత ''చిట్టిని చూడాలని వుంది''! ఒక ఉద్యోగస్థురాలైన మాతృమూర్తి వేదనను అందులో పొదిగాను. చాలామంది మెచ్చిన కవిత అది. ప్రస్తుతం లలిత సంగీతం వ్యాప్తిలో ఆకాశవాణి పాత్ర అనే వంశంపై పరిశోధ నాత్మక కృషి చేస్తున్నాను.

ఆమె చాలా జీవితం అంతా పుస్తకాలు, మృదంగం, వీణ, బుర్రకథకి వాడేవాద్యాల మధ్యే గడిచింది. విద్వత్తు విజ్ఞత ఉంటే సరిపోదు, బ్రతుకనేర్చిన తెలివి ఉండాలి అనే తండ్రి మాటలు ఆమెకి మార్గదర్శకం అయినాయి. స్తంభాలనే మైకులుగా భావించుకోమని ఏడేళ్ల పిల్లగా తనకి తండ్రి శిక్షణ నిచ్చారని చెప్పారామె. ''మా అమ్మ చలం, శరత్‌ సాహిత్యం చదివి నాకు ఎన్నో చెప్పేది. తెల్లారు ఝామున నాలుగు గంటలకే లేపి మమ్మల్ని చదివించేది. నాకు అన్ని ప్రైజులు వచ్చినా ఒక్క సారికూడా స్కూలుకి వచ్చేదికాదు. రాత్రిపదికి అంతా కలిసి భోజనం చేసి హాయిగా పాడుకునే వారం, అన్నారామె బాల్యాన్ని తలుచుకుంటూ. ఇక మద్రాస్‌ ఆకాశవాణిలో ఎన్నో స్త్రీల లైవ్‌ ప్రోగ్రాంలు నిర్వహించారు. అష్టావధానం, శతావధానంలా అన్ని సెక్షన్స్‌లో ప్రోగ్రాంలు నిర్వహించటం, మద్రాస్‌ సంగీత వారోత్సవాలకు ప్లాను చేయటం, అవసర మైతే తంబుర వేయటం, ఎనౌన్సర్‌ పని కూడా చేశారామె.

మద్రాస్‌లో సంగీత దిగ్గజాలైన ఎం.ఎస్‌, డి.కె, వీణ బాలచందర్‌ మొదలైన వారి పరిచయాలు ఈమెకి స్ఫూర్తి నిచ్చాయి. లైవ్‌ ప్రశ్నలను శ్రోతలు అడగటం ఈమెయే ప్రవేశ పెట్టారు తమిళం, తెలుగులో శ్రోతచెవికి ఒకేసారి ఎక్కేలా ప్రకటనలు రూపుదిద్దేలా తమిళం, హిందీ నించి కథలు, నాటకాలు 60 పగా అనువదించారు. షిరిడీ సాయి బాబా భక్తురాలు. శ్రీ రజనీ తర్వాత అంత శక్తి సామర్థ్యాలు, ఆల్‌ రౌండర్‌ అనిపించుకున్న ఆకాశవాణి డైరెక్టర్‌ ఈమెయే సుమా! నిజంగా ఇలాంటి ఆల్‌ రౌండర్‌ ఇంకా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.

- అచ్యుతుని రాజ్యశ్రీ