సోనార్ బాంగ్లా - ఇది కావటానికి బంగ్లాదేశ్ కి సంబంధించిన నాటకమే అయినా, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. స్వేచ్ఛా స్వాతంత్రాలకోసం పోరాడే ఏ దేశమైనా, ఏ జాతైనా ఈ నాటకం మాదేనని అనవచ్చు. కాకుంటే రంగస్థలం మారుతుంది, పాత్రలు మారతాయి.

మానవ విలువ కోసం, శ్రేయస్సు కోసం - అది ఏ దేశమైనా సరే, ఏ జాతియైనా సరే పడుతున్న తపనకు ప్రతీక మాత్రమే ఈ చిన్న నాటకం.

* పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది
* దానికి కారణం హిందువులా, ముస్లిములా లేక ఆంగ్లేయుల కుట్ర ఫలితమా
* హిందూ ముస్లిము సమస్య పరిష్కారం కోసం పుట్టిన పాకిస్తాన్లో తిరిగి ముసలం పుట్టటానికి కారణమేమిటి
* మతమనేది ఒక్కటే మనుషులని కలపగలితే అటు అల్జీరియా నుండి ఇటు ఇండోనేషియా దాకా ఒకటే రాజ్యం కావలసింది కదా మరి కాలేదేమిటి.
* విడిపోయిన పాకిస్తానుకు ఇండియా సహాయమే కావలసి వచ్చిందా
* ఇండియా చేసిన సాయంలో స్వార్థం ఉందా లేక నిస్వార్థంగానే చేసిందా
* ఇండియా చేసిన సాయం జోక్యం కల్పించుకోటమే అయితే టర్కీ, ఇరాన్, అమెరికా, చైనాలు చేసిందేమిటి
* ఆ సాయాన్ని ఏ పద్దు కింద వేస్తారు

ఇలాటి ప్రశ్నలన్నిటికి ఈ నాటకం సమాధానం చెప్పదు.

చెప్పవలసిన వారు రాజకీయనాయకులు, చరిత్రకారులు

ఏ దేశమైనా సరే ఏ జాతియైనా సరే, నల్లవాళ్ళు కానీ, తెల్లవాళ్ళు కానీ, ఇజ్రాయెలీలు కానీ , ఈజిప్షియన్లు కానీ, సామ్రాజ్యవాదులు కానీ, సోషలిస్టు మాంధాతలు కానీ. తూర్పున కానీ పడమర కానీ ఉత్తరాది కానీ దక్షిణాది కానీ ఎక్కడ ఏ అశ్రువు రాలినా, రక్తపు బొట్టు చిందినా అక్కడ ఇలాటి నాటకమే ఆడతారు జనం. 1971, ఏప్రిల్ 17వ తేదిన బాంగ్లా రాజధాని నగరం ఢాకాలో జరిగినట్టుగానే జరిగి తీరుతుంది


ఆ నాటకాన్ని తెలుగులో రచించీ, పాత్రధారుల చేత వేయించీ - ప్రసారం చెయ్యలేకపోయింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం....ఎందుకో, దానికి కారణాలేమిటో చెప్పనవసరం లేదు.

చరిత్ర గతుల లోకి, లోతుల్లోకి తొంగి చూసే అవకాశం కల్పించిన ఈ ఆడియో వింటే మీ ఒళ్ళు గగుర్పొడచడం ఖాయం.

అంతటి అత్యంత అరుదైన, అత్యంత అపురూపమైన ఆడియోను అందించిన మా గురువుగారు, నేను హెడ్ మాష్టార్ గారు అని ఆప్యాయంగా పిలుచుకునే డాక్టర్ కె.బి.గోపాలం గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలనో తెలియదు కానీ, వేలవేల సాష్టాంగ నమస్కారాలు మాత్రం ఇప్పటికిప్పుడు అర్పించగలను....

రచన, నిర్వహణ: శ్రీ కె.చిరంజీవి

నటీనట వర్గం

ప్రొఫెస్సర్ మౌలానా: శ్రీ చిరంజీవి
ఫాతిమా: శ్రీమతి ఎం.విజయలక్ష్మి
బీయమ్మ: వేజెండ్ల బాలకోటీశ్వరి
హసీనా: శ్రీమతి శారదా శ్రీనివాసన్
ఇక్బాల్: శ్రీ ఎన్.రవీంద్ర రెడ్డి
ఇస్లాం: శ్రీ టి.డి.ఎస్.వరప్రసాద్
రజాక్: శ్రీ అందే వెంకటేశ్వర రావు
అక్రం ఖాన్: శ్రీ లక్ష్మీపతి
గులాం ఖాన్: శ్రీ కె.శ్రీనివాస మూర్తి
సలాం ఖాన్: శ్రీ జె.సిద్దప్ప నాయుడు
ఇంకా శ్రీ గరిమెళ్ళ రామమూర్తి, శ్రీ డి.కె.వెంకటేశ్వర్లు మొదలైన వారు పాల్గొన్నారు

పై నటీనటులందరికీ, ప్రత్యేకంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక వందనాలతో

భవదీయుడు మాగంటి వంశీ