" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "
అపురూప చిత్ర సేకరణ: శ్రీ కప్పగంతు శివరామప్రసాద్, బెంగుళూరు |
శ్రీమతి రతన్ ప్రసాద్ (చిన్నక్క) గారి గురించి "వార్త" లో ప్రచురించబడ్డ వ్యాసం అనౌన్సరుకు అంతఃశత్రువ్ఞలుంటారు! శుక్ర వారం, మే 28, 2010 Interview: కె.యం.జి.కృష్ణ చూడమ్మాయి! మాకు సంగీత ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. అయితే బాగా స్పష్టంగా చదివేవారు కావాలి. నీ వాయిస్ మైకుకు బాగా సరిపోయింది.ఈ సాయంత్రం ఒక కథనానికి చదవాలి. నీకు ఇష్టమేనా? అని ప్రశ్నించారు అక్కడ పనిచేసే అతను. సరే అంటూ అనౌన్సర్‌గా మారిపోయింది ఆ అమ్మాయి. వయొలిన్, గాత్రంలో సుశిక్షితురాలైన అ అమ్మాయి సంగీత విద్వాంసురాలిగా స్థిరపడకపోయినా తన గాత్ర విన్యాసంతో అనౌన్సర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ప్రపంచంలోని ప్రతి లక్ష జనాభాలో పదిమంది తెలుగు ప్రముఖులు కనిపిస్తారు. ఈ మహానుభా వులే 20వ శతాబ్దపు తెలుగు చరిత్రకు వైతాళికులు. సినీ కళాకారులకు జన బాహుళ్యంతో ఉన్న గుర్తింపును రేడియో ఆర్టిస్టులకు కేవలం వారి కంఠస్వరం ద్వారా తీసుకువచ్చి ''స్టార్ వాల్యూ కలిగించిన అతికొద్ది మందిలో ''చిన్నక్క పేర్కొనదగినవారు. దక్కన్ రేడియో ''ఆకాశవాణిగా రూపాంతరం చెందిన తొలిరోజుల్లో సంగీతంలో ఆడిషన్ కోసం వెళితే ఒక ''స్క్రిప్టు ఇచ్చి చదవమని నా కంఠస్వరంలోని ప్రత్యేకతను గుర్తించి అనౌన్సర్‌గా ఎంపిక చేశారు. అలా మొదలైన నా రేడియో జీవితం జనజీవితంలో మమేకమైపోయింది. ''స్పోకెన్ వర్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకునే అదష్టం ఉండబట్టే సంగీత కళాకారిణిని కాలేకపోయాననే 77 వసంతాల రేడియో చిన్నక్క జీవనయానంలోని వెలుగునీడలు వారి మాటల్లోనే... నేను 1933 నవంబరు 10న పుట్టాను. అసలు పేరు రత్నావళి. ఆకాశవాణిలో జాయిన్ అవడమే విచిత్రం. సంగీతం ఆడిషన్ కోసం వెళ్ళి నన్ను నా స్వర మాధుర్యాన్ని గుర్తించి అనౌన్సర్‌గా తీసుకున్నారు.''చేనుగట్టు కథాపఠనంతో ప్రారంభమైనా ప్రస్థానం ఎన్నో మలుపులు తిరిగింది. 1955 నుండి కాంట్రాక్ట్ విూద ఉద్యోగంలో చేరాను. 1958కి పర్మినెంట్ అయ్యాను. అప్పట్లో పని ఎక్కువ. కళాకారులు తక్కువ. అన్ని సెక్షన్లలో పని చేయాల్సివచ్చేది. త్రిపురనేని గోపిచంద్, దేవులపల్లి, దాశరథి వంటి ఎందరో సాహితీ ప్రముఖులతో పనిచేసే అవకాశం కలిగింది. నాటకాల్లో కూడా పాల్గొని మంచి నటిగా పేరు తెచ్చుకున్నా అడపదడపా ప్రాంతీయ వార్తలు చదివేదాన్ని. అప్పట్లో అన్నీ ప్రత్యక్ష ప్రసారాలే వుండేవి. స్టాఫ్ ఆర్టిస్టుకంటే స్థాయి ఎక్కువని ఎనౌన్సర్‌గా అప్లై చేసి 1960 నుండి షిప్టు డ్యూటీలకు సైతం అలవాటుపడ్డాను. ఇందులో చేరాక వెనక్కి తిరగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఎవరి దగ్గరా పనిచేయాల్సిన అగత్యం ఏర్పడలేదు. అన్నిరకాల గ్రేడులు దాటి సెలక్షన్ గ్రేడు అనౌన్సర్‌గా 1992లో రిటైర్ అయ్యాను. అనౌన్సర్‌నయినా చంద్రిగా తెలంగాణా మాండలికంలో చాలా ప్రోగ్రాంలను గ్రామసీమల్లో నిర్వహించాను. ఆదివారాలు కార్మికుల కార్యక్రమం లో రమణక్కగా (తెలంగాణా మాండలికం), వి.సత్యనారాయణ (జగన్నాథం) మేమిద్దరం వాదించుకుంటుంటే మూడో పాత్ర ప్రవేశించి ఆ అంశంలో ప్రాధాన్యతనూ, ఉపయోగాల్ని చెప్పడం జరిగేది. తొలిరోజుల్లో ఉషశ్రీ (పెదబాబు), తర్వాత టి.వి.ఆర్.కె.సుబ్బారావు(యాదగిరి), తురగా కష్ణమోహన్ (కిష్టయ్య), డి.వెంకట్రామయ్య (రాంబాబు) నిర్వహించారు. ఓసారి ''రమణక్క నీకు నోరు ఎక్కువ అన్నాడు జగన్నాథం. అంటే మా ఆంధ్రోళ్ళకు లేదా! మళ్ళీ ఏమైనా అంటే రేడియోస్టేషన్ కాలబెడతాం అని ఉత్తరాలు వచ్చాయి. దానితో రెండు నెలలపాటు కార్యక్రమాన్ని నిలిపేసి తిరిగి మొదలుపెట్టారు. రమణక్కగా అవతారాన్ని చాలించి నేను చిన్నక్కగా, సత్యనారాయణ (జగన్నాథం) ఏకాంబ రంగా పరకాయ ప్రవేశం చేసి కార్యక్రమాలను కొనసాగించాం. ఏ కారణం వల్లనో ఒకవారం నేను కార్యక్రమంలో పాల్గొనకపోతే ''చిన్నక్క రాలేదేమిటి? అని జవాబులు వచ్చేవి. జాతీయ కవిసమ్మేళనాలకు, రేడియో సంగీత సమ్మేళనాలకు, ఆహూతుల సమక్షంలో ఎన్నోసార్లు అనౌన్స్ చేశాను. చిత్తూరు సుబ్రమణ్య పిళ్ళై చైంబై వైద్యనాథ భాగవతార, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారి, ఎస్.బాలచందర్, టి.ఆర్. మహాలింగం, ద్వారం వెంకటస్వామినాయుడు, కున్నకుడి వైద్యనాధన్ మొదలైన ఎందరో మహామహుల కార్యక్రమాలను ఆహుతుల సమక్షంలో ప్రకటించే అవకాశం నాకు లభించడం మరువలేను. ఇవి రేడియోలో అప్పటికప్పుడు ప్రసారం అయ్యేవి. గుండె నిబ్బరంతో, గంభీరంగా ఇచ్చే నా స్టేజి ఎనౌన్స్‌మెంట్లకు శ్రోతల్లోనూ విశేష ఆదరణ లభించేది. ఏ ఒక్క అక్షరంకానీ, ఒక కామా, ఫుల్‌స్టాప్‌గానీ, తడబడి తప్పుగా చెప్పడం ఇప్పటి వరకూ జరగలేదు. అసలు నా సర్వీసులోనే 'క్షమించండి అనే పదం ఉపయోగించలేదు. ఆ విషయం నిజంగా ఎంతో గర్వకారణం అని సుధామ మెచ్చుకున్నారు. నేను ఆకాశవాణిలో చేరిన తొలిరోజుల్లో నిత్యం జరిగే విూటింగ్‌లు శ్రీకృష్ణదేవరాయల కొలువ్ఞను తలపించేవి. స్థానం నరసింహారావ్ఞ, నాయని సుబ్బారావ్ఞ, మంచాల జగన్నాధరావ్ఞ, వేలూరి సహజానంద, గొల్లపూడి మారుతీరావ్ఞ, బుచ్చిబాబు మొదలైన ఎందరో సంగీత సాహితీ, నాటక కళాతపస్వులతో కొలువైన ఆ ప్రోగ్రాంలో నేను కూడ పాల్గొనేదాన్ని. ఒక్కొక్కరూ కదిలే గ్రంథాలయంగా భాసించేవారు. ఎంత సమయ పాలన ఖచ్చితంగా పాటించేవాళ్ళయినా సెకన్లను ఎవరూ పట్టించుకోరేమో! కానీ రేడియో ప్రసారాల్లో సెకన్లు కూడ ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. అనౌన్సర్ ఉద్యోగం కత్తిమీద సాములాంటిది. దీనికి బాహ్య శత్రువ్ఞలుండరు. అంతఃశత్రువ్ఞలైన కళ్ళు, నాలుక, చేయి, తప్ప అవి ఎలాగంటే స్క్రిప్టులోని అక్షరాలు అప్పుడప్పుడూ తప్పుదారి పట్టిస్తుంటాయి. కళ్ళు తప్పుదారి పడితే నాలుక తప్పు చదువ్ఞతుంది. ఇక చెయ్యి విషయంలో అనౌన్సర్ చేతివేళ్ళు మైకు, రికార్డ్‌ప్లేయర్, టేప్‌రికార్డర్ల ఫీడర్లవిూద నాట్యం చేస్తుంటాయి. వాటిల్లో మాత్రం పొరపాటు జరిగినా మొత్తం కార్యక్రమం రసాభాస అవ్ఞతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఎన్నికల ఫలితాల వార్తలు వెలువడే సమయాల్లో పదే పదే ఎనౌన్స్ చేయాల్సి వస్తే మరింత జాగ్రత్తగా వ్ఞండాలి. 1969లో అనుకుంటా గండిపేట తెగిపోయిందనీ హైదరాబాద్ మునిగిపోతోందని వదంతులు వ్యాపించాయి. పోలీసు బలం, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా చెప్పినా జనం వినలేదు. ఆ సమయంలో నేను డ్యూటీలో వ్ఞన్నాను. కార్యక్రమాలను మధ్యమధ్యలో ఆపేసి దృఢంగా, స్వేచ్ఛగా సంఘ విద్రోహాలు సృష్టిస్తున్న వదంతులను వినకండి, విూ ఇళ్ళకు వెళ్ళిపోండి అని పదేపదే నేను చెప్పిన ధైర్యవచనాలకు పాన్‌షాపుల ముందు నిల్చున్న జనం మెల్లమెల్లగా తిరుగుముఖం పట్టారట. మర్నాడు నగర పోలీసు కవిూషనర్ స్టేషన్‌కు వచ్చి ఎంతగానో మెచ్చుకుని తమ డిపార్ట్‌మెంట్ తరపున 'అవార్డు ఇస్తామన్నారు. అలాగే పాకిస్తాన్, భారత్ యుద్ధ సమయంలో దేశభక్తి పూరితమైన పాటలు, కథలు, గాథలు, ప్రసంగాలు వినిపించడం, మధ్యమధ్య ఉద్వేగ పూరితమైన స్లోగన్స్ చదవడం అపూర్వ అను భూతి. తుఫాన్ రోజుల్లో తెల్లవార్లూ మంచి మంచి సినీ గీతాలు ఏరి తెచ్చుకుని, మధ్య మధ్యలో వాతావరణ హెచ్చరికలు తెలియచేస్తూ మళ్ళీ పాటలు వినిపించేదాన్ని. వాటిని చాలామంది రికార్డు చేసుకునేవారు. అంత మంచి పాటలు వినాలనే సదుద్దేశంతో ''అక్కయ్యా మళ్ళీ తుఫాన్ ఎప్పుడొస్తుంది అని ఉత్తరాలు వ్రాసేవారు. నేను చాలా రేడియో నాటకాల్లో కూడా పాల్గొన్నాను. ''రేడియో నాటకం ఇంతకష్టం అనుకోలేదు. నాకంటే విూరంతా బాగా నటించారు కేవలం గొంతుతో అని ఒకసారి నటుడు అక్కినేని నాగేశ్వరరావ్ఞ మమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అలాగే కాంతం కథలను కొన్ని రూపకాలుగా మార్చి ప్రసారం చేశాం. అందులో నేను 'కాంతంగా నటించాను. ముని మాణిక్యం 'నాకాంతం మళ్ళీ బతికొచ్చిందమ్మా! అంటూ వెక్కి వెక్కి ఏడ్చేశారు. స్త్రీల కార్యక్రమం 'రంగవల్లిలో 'అమ్మబడి అనే శీర్షిక నిర్వహించాను. 'గ్రామసీమలులో రామాయణం చదివి వినిపించేదాన్ని. 1962లో చైనా యుద్ధ సమయంలో సైనికసోదరులు వారి భార్యలకు వ్రాసినట్లుగా దేశభక్తి పూరితమైన 'హంస సందేశం అనే ధారావాహిక ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించాను. 'వన్నెల విసనకర్ర శీర్షికలో స్త్రీల వస్త్రధారణ, నగల గురించి వ్యాస పరంపర చేశాను. అనేక కథలు రచించి ప్రసారం చేశాను. చంద్రి, రమణక్క, చిన్నక్క స్టాన్ క్యారెక్టర్స్ నిర్వహించాను. చిత్రమేమిటంటే చిన్నక్కగా నేను స్క్రిప్టు రాయడంగానీ, చూసి చదవడంగానీ ఉండేది కాదు. అశువ్ఞగా మాట్లాడటం వల్లనే ఆ పాత్రకు అంత సహజత్వం సిద్ధించి ఉంటుంది. ప్రపంచంలోని ప్రసార వ్యవస్థల్లో (బి.బి.సి. వాయిస్ ఆఫ్ అమెరికా) 28 సంవత్సరాలపాటు ఏకధాటిగా ఇలాంటి ఒకేపాత్రను నిర్వహించినవారు అరుదు. అలాగే 'నవలా స్రవంతి శీర్షికన దాశరధి రంగాచార్య గారి 'చిల్లర దేవ్ఞళ్ళు నవలను తెలంగాణా మాండలికంలో ఆరునెలలపాటు చదివాను. కొత్తపల్లి వీరభద్రరావ్ఞ ''వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అని ప్రశంసించారు. హైదరాబాద్‌కు వచ్చిన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కార్మికుల కార్యక్రమంలోని మా త్రయాన్ని పిలిపించుకుని మాటలు విని చాలా సంతోషించి ఎంతగానో ప్రశంసించి సన్మానించారు. ''చదివి తెలుసుకునేకన్నా విని తెలుసుకోవడం తేలికన్న దృష్టితో నిరక్షరాస్యుల్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళిన రేడియోలో కుటుంబ నియంత్రణను పరిచయం చేసి ప్రచారం చేయడంలో నా కృషి మర్చిపోలేను. అందుకే ''ఆ స్మృతులు సజీవాలు అన్నారు చిన్నక్క.రైల్వేలో పనిచేసిన నా భర్త ప్రసాద్ తన మొదటి క్రిటిక్ అనే చిన్నక్కను శ్రీలంక నుండి తెలుగు ప్రసారాలకు తనదైన ఒరవడి దిద్దిన అనౌన్సర్ విూనాక్షి పొన్నోదురై తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో కలిసి వయసులో పెద్దదాన్ని అయినా ఏకలవ్య శిష్యురాల్ని అని సవినయంగా పేర్కొనడం రతన్ ప్రసాద్ (రత్నావళిలో రతన్, భర్త ప్రసాద్‌ను పేరు ఇముడ్చుకుని రతన్‌ప్రసాద్ అయ్యింది)లోని కృషి అంకితభావం, కఠోర దీక్షలకు నిదర్శనం. నేటి టెలివిజన్ కల్చర్ తెలుగు జీవితాన్నే కాదు, అన్ని భాషల, ప్రాంతాల జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు కాలక్షేపానికి పుస్తక పఠనం వ్ఞండేది. నేడు అది టి.వి కాలక్షేపంగా మారినా 'రేడియో చిన్నక్క ప్రతిశోత మనసులో చిరంజీవి. ''మా ఊరికి రైలులేదు, బస్సురాదు, అయినా ప్రతివారం చిన్నక్క వచ్చి మమ్మల్ని పలకరిస్తుంది. అని వెనకటికి ఒక శ్రోత పేర్కొన్నట్లు తన గళ మాధుర్యంతో ప్రతి ఒక్కరిలోనూ ఇమేజ్‌ను సంపాదించిన రతన్ ప్రసాద్ ఉచ్ఛారణా సామర్ధ్యం అనితర సాధ్యం. ఈమధ్యనే ఈమెకు మన నేటితరం అనౌన్సర్లకు, యాంకర్లకు ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తిలేదు. |