" స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో "

శ్రీ దాశరథి - శ్రీ పాలగుమ్మి పద్మరాజు

శ్రీమతి దుర్గ గారి సౌజన్యంతో
పాలగుమ్మి పద్మరాజు గారి గురించి ఈనాడులో వచ్చిన వ్యాసం. ఈ వ్యాసం ఇలా ఇక్కడ ఉంచటం అభ్యంతరకరమితే తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను

తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన పాలగుమ్మి పద్మరాజు

'తెలుగు కథా సాహిత్యంలో ప్రముఖులుగా ఇరవై మందిని ఏరి, అందులో మళ్లీ అయిదుగురిని ఎంపిక చేస్తే అందులో ప్రముఖుడిగా నిలిచే కథకుడు పద్మరాజు'- అని ప్రసిద్ధ విమర్శకులు డి. రామలింగం కొన్ని దశాబ్దాల క్రితమే అన్నారు. అది వట్టి మాట కాదు. నిశిత పరిశీలనతో, అధ్యయనంతో అన్న మాట. అందుకే అది విలువైన మాటగా చరిత్రలో నిలిచిపోయింది. రాసింది తక్కువే అయినా వాసిలో మెచ్చదగిన రచనలు చేశారు పాలగుమ్మి పద్మరాజు.

1952లో తెలుగు కథా సాహిత్యానికి మహోన్నతమైన గుర్తింపు తెచ్చిన రచయిత పాలగుమ్మి పద్మరాజు. న్యూయార్క్‌, హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ నిర్వహించిన ప్రపంచ కథానిక పోటీలలో పద్మరాజు కథ 'గాలివాన' రెండో బహుమతి పొందింది. తెలుగు భాషను, ఆ భాషలో వచ్చిన కథానికనీ, తెలుగు జాతి జీవనాన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజ్వలింపచేసిన కథకులు పాలగుమ్మి. విచిత్రమేమిటంటే, ఆ తర్వాత కానీ, అంతకు ముందు కానీ ఎంతో మంది గొప్ప రచయితలున్నా అటువంటి గౌరవం ఎవరికీ దక్కకపోవడమే. 1952 నుంచీ ఎప్పుడు, ఎక్కడ పాలగుమ్మి పద్మరాజు పేరు వినిపించినా 'గాలివాన' కథ ప్రస్తావన తప్పక వస్తూనే ఉంది. పెద్ద చేప చిన్న చేపలను మింగినట్లు, 'గాలివాన' కథ, పాలగుమ్మి అంతకన్నా గొప్పగా రాసిన కథలను సైతం మింగేసింది. ఏ భూమిక మీద, ఏ తాత్విక నేపథ్యం ఆధారంగా పాలగుమ్మి 'గాలివాన' కథ రాశారో అదే భూమిక మీద, అంతకన్నా గాఢమైన, సాంద్రత అధికమైన భూమిక మీద, అంతకన్నా లోతైన తాత్వికతతో ఎన్నో కథలు రాశారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డునీ, గుర్తింపునీ 'గాలివాన' తేవడం వల్ల అదే ఆయనకు ప్రతీకగా నిలిచింది.

పాలగుమ్మి పద్మరాజు పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురంలో 1915లో జన్మించారు. అరవై కథల వరకు రాశారు. వాటన్నిటినీ 'గాలివాన, పడవ ప్రయాణం, ఎదురు చూసిన ముహూర్తం' అనే సంపుటాలుగా ప్రచురించారు. అయిదారు నవలలు కూడా రాశారు. 'రామరాజ్యానికి రహదారి, నల్లరేగడి, బతికిన కాలేజీ, రెండో అశోకుడి మూణ్ణాళ్ళ పాలన' చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిల్లో మొదటి రెండు నవలలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. 'బతికిన కాలేజీ, రెండో అశోకుడి మూణ్ణాళ్ళ పాలన' ఆయన హాస్య చతురతను చాటే నవలలు. ఆయన ఎన్నో సినిమాలకి సంభాషణలు రాశారు. కొన్ని చిత్రాలకు పాటలు కూడా రాశారు. కొందరికి 'ఘోస్ట్‌' రైటర్‌గా పని చేశారనేది కొందరి వ్యాఖ్య. పాలగుమ్మి పద్మరాజు కథలన్నింటిలోనూ తొలి కథగా గుర్తింపు పొందిన కథ 'సుబ్బి'. దీన్ని ఆయన 1937-38 ప్రాంతాల్లో రాశారు. అంటే ఆయనకి అప్పుడు ఇరవై మూడు సంవత్సరాల లోపేనన్నమాట. ఆ కథే అప్పట్లో సంచలనం సృష్టించింది. సంపన్నుల కుమారుడు సెలవులకు ఇంటికొస్తాడు. ఇంట్లో ఉన్న ఎదిగిన పనమ్మాయి సుబ్బితో రహస్య సంబంధం పెట్టుకుంటాడు. సెలవులు కాగానే అతను వెళ్లిపోతాడు. సుబ్బి గర్భవతి అవుతుంది. అందరూ నిలదీస్తారు. కారకులు ఎవరో చెప్పదు. యజమానురాలు చేరదీస్తుంది. కానీ యజమాని అసహ్యించుకుంటాడు. 'సుబ్బి' అబ్బాయిని ప్రసవిస్తుంది. కొంత కాలానికి యజమాని కొడుకే అందుకు కారణమని తెలుస్తుంది. అప్పుడు యజమానురాలు అసహ్యించుకుంటుంది. అయితే యజమాని చేరదీస్తాడు. వారి వైఖరి పూర్తిగా మారిపోతుంది. పాతికేళ్లయినా లేని రచయిత ఇటువంటి కథ రాస్తాడని ఎవరూ ఊహించలేరు. అదే పద్మరాజు విశిష్టత.

ఆయన ఎన్నుకొనే కథా వస్తువు, శైలి, భాష ఈ మూడు మిగిలిన వారికన్నా భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్క కథకు ఒక్కొక్క విధమైన శిల్ప నిర్మాణ చాతుర్యం ప్రదర్శించారు పద్మరాజు. 'మనుషుల లోలోపలి ప్రవృత్తులు చెప్పడానికి వీలయిన సంఘటనలతో ఉండే వస్తువులే పద్మరాజు కథల్లో కనిపిస్తాయి. వాటి వస్తు పరిధి ఎంత విశాలమైందో, అంత లోతైంది కూడా. మానవ జీవితమే ఎల్లలుగా వికసించినది' అంటారు ఆయన అభిమాన విమర్శకులొకరు. అలాగే, ఆయన తన కథలకు ఎన్నుకొన్న వస్తువును విశ్లేషిస్తూ 'పద్మరాజు కథల్లో ఏ కథలోని విషయమూ ఏ సిద్ధాంత పరిధిలోనూ ఇమడదు' అంటారు నిజమే. ఎందుకంటే సిద్ధాంతాలకు ఉన్న పరిమితులను ఆయన గుర్తించారు. మానవ జీవితం స్థిరంగా ఒకచోట నిలిచిపోయిన గుట్టలాగా, రాతిలాగా ఉండదు. అది అవిశ్రాంతంగా ప్రవహిస్తుంటుంది. దానికి సిద్ధాంతాల ఆనకట్టలు కుదరవు అన్న విషయాన్ని ఆయన గ్రహించారు. అందుకే ఆయన ఓ చోట అంటారు 'నీతి నియమాలు, సిద్ధాంతాలు, మానవ ప్రవృత్తులను నియమ బద్ధం చేయాలని చూస్తాయి. అంతవరకూ వాటి ఉద్దేశం మంచిదే కానీ జీవితం ఎప్పటికప్పుడు వాటి నుంచి జారిపోతూ ఉంటుంది' మరోచోట కథా వస్తువు గురించి మాట్లాడుతూ 'యుగయుగాలు గడిచిపోయినా, నమ్మకాలు మారిపోయినా,మనకి అర్థం కాని తత్వం ఒకటి లోకంలో మిగులుతూనే ఉంటుంది. ఆ తత్వానికీ, మనిషి వైజ్ఞానిక బుద్ధికీ వ్యత్యాసం ఉండి తీరుతుంది. అటువంటి వ్యత్యాసమే కథా రచనకు మూల వస్తువు. ఒక తీక్షణమైన వ్యత్యాసాన్ని గుర్తించినప్పుడు కానీ కథ పుట్టదు. కథా రచనకు ప్రధానమైనది ఈ నాగరిక ప్రపంచానికీ కూడా అడుగున ఉన్న అనాగరికత. అందువల్ల కథకులు ఆ అనాగరిక లోకాన్నే పరీక్షించాలి. నాగరిక సంఘంలోని అనాగరికత గుర్తించాలి. దానితో తాదాత్మ్యం పొందాలి' అనీ, ఇది నిజంగా ఎంతో విలువైన సూచన.

పద్మరాజు తాత్విక చింతన కోసమే రచనలు చేయలేదు. అయితే ఆయన రచనలన్నిటిలోనూ ఒక తాత్విక చింతన, మదనం కనిపిస్తుంది. ఆయన వాడుకొనే ఉపమానాలు, వాక్య సంయోజనం, శైలి అన్నీ ఆయన రచనలకు ఒక గాంభీర్యాన్ని అందిస్తాయి. ఆ గాంభీర్యం వెనుక హృదయస్పందన కూడా కనిపిస్తుంది. ఏడెనిమిదేళ్ల వయసు నుంచీ పద్మరాజు తన పరిసరాలను గమనించారు. తన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకున్నారు. వాటన్నిటినీ తన మనో ఫలకం మీద ముద్రించుకున్నారు. తన పసి వయస్సు మీద ముద్ర వేసిన వ్యక్తులను, వారి ప్రవృత్తులను, మానవీయ సంబంధాలను, ఆ ఉద్రేకాలను మానవ సంబంధమైన ఉద్వేగాలు... ఇలా మొత్తాన్నీ తన కథల్లో చూపారు. అందువల్లే అవి వాస్తవికతతో విలక్షణంగా కనిపిస్తాయి.

పాలగుమ్మి ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాలను ఆకళింపు చేసుకున్నారు. ఆయన రాసిందానికన్నా చదివిందే ఎక్కువ. అందువల్లే ఆయన రచనల్లో ఒక చిక్కదనం, వైశిత్వం బాగా కనిపిస్తాయి. అందుకే కొందరు విమర్శకులు 'పద్మరాజు కళ్ళు ఎక్స్‌రే కన్నా పవర్‌ఫుల్‌' అంటారు. తనకు మంచిపేరు తెచ్చిన రెండు నవలల్లో 'రామరాజ్యానికి రహదారి'లో స్వాతంత్య్రోద్యమం లాంటి సామాజిక స్పందనలను వివరిస్తారు. అలాగే 'నల్లరేగడి'లో నగరీకరణ ప్రభావం పడని తెలుగు దేశపు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిభావంతంగా చిత్రించారు. ఇక అవార్డు తెచ్చిన 'గాలివాన' కథలో ప్రకృతి శక్తులను అంగీకరించడం వల్ల మాత్రమే మనిషి ఎదగడం సాధ్యమవుతుందన్న భారతీయ సాహిత్యపు మూల సూత్రాన్ని కమనీయంగా వివరిస్తారు.

'విశ్వాసాలకు విలువ మారుతుంది. కానీ విలువ మారినంత మాత్రాన ఆ విశ్వాసాలు మొదటి నుంచి అనర్థదాయకమైనవి అనడానికి వీల్లేదు. పాత తత్వానికీ, కొత్త తత్వానికీ ఉన్న సంబంధాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది' అంటూ మంచి కథల నిర్మాణానికి సూచనలు చేసిన పద్మరాజు 1983లో అస్తమించారు. సినిమా రచనలో తన ప్రభావం చూపలేకపోయినా కథకుడిగా, నవలా రచయితగా మాత్రం ఆయన ఎప్పటికీ స్థిరంగా నిలిచే 'గాలివానే'.

- చీకోలు సుందరయ్య