మిరపకాయ పొట్టోడి కథ


అనగనగా ఒక ఊర్లో ఓ మిరపకాయంత పొట్టోడు ఓ ఈతకాయంత ఇంట్లో ఉండేవాడు. ఆ మిరపకాయ పొట్టోడు ప్రతిరోజూ సొరకాయంత సైకిలెక్కి ఊర్లోకి వెళ్లి కష్టపడి పని చేసి, చేసి బోలెడు డబ్బు కూడపెట్టి బాదంకాయంత బంగారం కొనుక్కున్నాడు. ఈతకాయంత ఇంట్లో ఉన్న గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాలో, కొనుక్కున బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, బీరకాయంత బీరువాకి తాటికాయంత తాళం వేస్తాడు.

ఓ రోజు మిరపకాయ పొట్టోడు సొరకాయంత సైకిలెక్కి పని మీద బయటికి వెళ్ళగానే ఓ దోసకాయంత దొంగోడు వచ్చి మిరపకాయ పొట్టోడి ఈతకాయంత ఇంట్లోకి దూరేసి, గచ్చకాయంత గదిలోకి వెళ్ళి, ఓ మూలన ఉన్న బీరకాయంత బీరువాకి ఉన్న తాటికాయంత తాళం పగలగొట్టేసి, అందులో ఉన్న బాదంకాయంత బంగారాన్ని తీసుకుని పారిపోయాడు.

సాయంత్రం ఇంటికి రాగానే మిరపకాయ పొట్టోడు తన ఈతకాయంత ఇంటికొచ్చి, గచ్చకాయంత గదిలోకెళ్ళి, బీరకాయంత బీరువాకున్న తాటికాయంత తాళం పగలగొట్టేసి ఉండటం చూస్తాడు. దాచుకున్న బాదంకాయంత బంగారం కూడా పోయిందని చూడగానే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడున్న పొట్లకాయంత పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు.. బోల్డు డబ్బులు పెట్టి కొనుక్కున బాదంకాయంత బంగారాన్ని తన ఈతకాయంత ఇంట్లో, గచ్చకాయంత గదిలో ఓ మూలన ఉన్న, బీరకాయంత బీరువాలో తాటికాయంత తాళం వేసి దాచిపెట్టుకుంటే దోసకాయంత దొంగోడొచ్చి దోచుకెళ్లిపోయాడని.

వెంటనే ఆ పొట్లకాయంత పోలీసు తనకున్న మావిడికాయంత మోటారు సైకిలెక్కి గబగబా వెళ్లి దోసకాయంత దొంగోడిని పట్టేసుకుని, వాడి దగ్గరున్న బాదంకాయంత బంగారాన్ని తీసేసుకుని మిరపకాయ పొట్టోడికి ఇచ్చేసి దోసకాయంత దొంగోడిని జాంకాయంత జైల్లో పడేస్తాదు. అప్పుడు మిరపకాయ పొట్టోడు దోసకాయంత దొంగని పట్టుకుని బాదంకాయంత బంగారాన్ని తనకి తెచ్చిచ్చినందుకు పొట్లకాయంత పోలీసుని మెచ్చుకుని, ఆ తరవాత సొరకాయంత సైకిలేస్కుని, తన ఈతకాయంత ఇంటికెళ్ళి, గచ్చకాయంత గదిలో ఓ మూలనున్న బీరకాయంత బీరువాలో బాదంకాయంత బంగారాన్ని దాచిపెట్టి, దానికి తాటికాయంత తాళం వేసుకుని దాచిపెట్టుకుంటాడు.

కథ కంచికి...మిరపకాయ పొట్టోడు ఇంటికి